Caste Census | సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభాయే ఎందుకు తగ్గింది? కులగణనలో కులాలవారీ లెక్కలేవి? అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చర్చ ఎందుకు పెట్టలేదు? కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ఎందుకు విస్మరిస్తున్నారు? చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, తీరా పార్టీ పరంగా ఇస్తామనుడేంది? ఇవి బీసీ వర్గాల నుంచి కాంగ్రెస్ సర్కార్‌కు ఎదురవుతున్న ప్రశ్నల బాణాలు. ఏడాదిగా ఎదురుచూశాం.. కాంగ్రెస్ నమ్మించి నయవంచనకు గురిచేసింది.. బీసీ హక్కుల సాధనకు పోరుబాట ఒక్కటే మార్గం. భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం.. అని బీసీ కుల సంఘాలు ప్రకటించాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కులగణన నివేదికను తప్పులతడకగా రూపొందించారని, దురుద్దేశపూర్వకంగానే బీసీ జనాభాను తగ్గించి చూపారని కాంగ్రెస్ సర్కార్‌పై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు రగిలిపోతున్నారు. సర్వే గణాంకాలపై అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను సైతం తుంగలో తొక్కుతూ, కేవలం పార్టీ పరంగానే రిజర్వేషన్లను కల్పిస్తామని చేసిన ప్రకటన కూడా వారిలో మరింత ఆజ్యంపోసింది. ఇది నయవంచనే అని బీసీ మేధావులు, కుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే పలు కుల సంఘాలు అంతర్గత సమావేశాలను నిర్వహించుకొని సర్వే గణాంకాలపై మేధోమథనం సాగించాయి. త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని బాహాటంగానే ప్రకటించాయి. బీసీ అనుబంధ సంఘాలన్నీ ఐక్యంగా పోరుబాటలో భాగమయ్యేందుకు ముందుకొస్తున్నాయి. సర్కార్ సర్వే నివేదికపై సొంత పార్టీ నేతల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. దీంతో కాంగ్రెస్ సర్కార్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, ఇంటింటి సర్వేపై రేవంత్ సర్కారు ఆది నుంచీ కాంగ్రెస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని బీసీ, కులసంఘాల వారు మండిపడుతున్నారు. ఆదినుంచీ అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసినా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని నిప్పులు చెరుగుతున్నారు.
బీసీ, ఎస్సీల జనాభా ఎందుకు తగ్గింది?
అన్నివర్గాల జనాభా పెరిగి, బీసీ, ఎస్సీల జనాభా తగ్గడమేమిటని ఆయా వర్గాల వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. బీసీలకు చట్టబద్ధంగా కాకుండా, పార్టీపరంగా రిజర్వేషన్లను కల్పిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించడంతో బీసీ కులసంఘాల నేతలు మరింత రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధిలేదనేందుకు ఇదే నిదర్శమని వివరిస్తున్నారు. హైకోర్టు అక్షింతలు వేసేంతవరకూ కాంగ్రెస్ సర్కారు డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని గుర్తుచేస్తున్నారు. రేవంత్ సర్కారు తీరుతో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గే ప్రమాదం ఏర్పడిందని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. 42% ఏమో కానీ ఉన్న రిజర్వేషన్లే ఊడిపోయేలా ఉన్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సర్కార్ తీరుపై పోరుకు సమాయత్తం
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ కుల సంఘాలు, ప్రజాసంఘాలు, మేధావులు రగిలిపోతున్నారు. ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. 42% రిజర్వేషన్ల పెంపుపై రేవంత్‌రెడ్డి సర్కార్ బీసీలను దగా చేస్తున్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నిప్పులు చెరిగారు. చట్టబద్ధంగా కాకుండా పార్టీపరంగా ఇస్తామనడం మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తే, బుద్ధిచెప్పక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రకటనపై, సర్వే గణాంకాలపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇప్పటికే ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ నేతల అఖిలపక్ష సమావేశంలో సర్వేపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బీసీలకు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు బీఆర్ఎస్, ఇతర రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కులసంఘాలతో గొంతుకలిపాయి. ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నించడమేగాక, సర్వే గణాంకాల తప్పొప్పులను ఎత్తిచూపుతున్నాయి. సర్కారు మోసాన్ని ఎండగడుతున్నాయి.