ములుగు జిల్లా చల్పాక సమీపంలో మావోయిస్టులపై జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఆ ఎన్కౌంటర్పై ప్రభుత్వం వెంటనే జుడీషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్లో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రశ్నించే వాళ్లకు బతికే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు.
2026 నాటికి మావోయిస్టులను తుడిచిపెడతామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించడంలోని అర్ధం ఏమిటని? కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. ప్రశ్నించే వారికి స్వేచ్ఛ లేదా? వారిని బతకనివ్వరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టులు పరిమిత సంఖ్యలోనే ఉండవచ్చని, కానీ వారితో పాటు కమ్యూనిస్టులందరి భావజాలం ప్రశ్నించడమేనని, ప్రశ్నించే వారందరినీ చంపేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్కౌంటర్లు తెలంగాణ ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా? తెలియక జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు.
ఛత్తీస్గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ పోలీసులు ఎందుకు పాల్గొన్నారని కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తెలియకుండా జరిగితే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ తీసుకుని జరుగుతున్న పరిణామాలపై సమీక్షించాలని సాంబశివరావు సూచించారు. దేశంలో మానవ హక్కుల పరిరక్షణలో అత్యున్నత న్యాయవ్యవస్థ భాగస్వామ్యం కావాలని, పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సంఘటనలను న్యాయవ్యవస్థ సుమోటోను బాధ్యతగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థ పట్టించుకోనట్లయితే దేశంలో మానవ హక్కులకు స్థానం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.