వరంగల్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను 18 నుంచి నిర్వహిస్తున్నామని తెలిపిన కేంద్రం ఎజెండా ప్రకటించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 29వ డివిజన్లో జరిగిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, వృత్తిదారుల అభ్యున్నతి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు.