హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ర్టానికి చెందిన లక్ష మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్టు కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా, రాష్ట్ర ప్రభుత్వం, ఎస్సీ సంక్షేమ, విద్యాశాఖల అధికారులు దృష్టి సారించకపోవడంతో 2600 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 30వ తేదీతో గడువు ముగుస్తున్నది. విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తున్నది.
దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన 9వ, 10వ తరగతి విద్యార్థులకు కేంద్రం ఏటా ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తుంది. ఒక్కో రాష్ట్రంలో ఇంతమందికి అని కోటా విధిస్తుంది. అలా మన రాష్ట్రంలో లక్ష మందికి స్కాలర్షిప్లు ఇస్తామని తెలిపింది. ఈ స్కాలర్షిప్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్, కేంద్ర విద్యాలయాల్లో 9వ, 10వ తరగతికి చెందిన ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు డే స్కాలర్ అయితే రూ.3,500, హాస్టల్లో ఉండి చదువుకునే వారికి రూ.7 వేలు చొప్పున ఉపకారవేతనం అందిస్తుంది.
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, పాఠశాల కోడ్ నంబర్‌తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ రాష్ట్ర విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమశాఖల అధికారులు పట్టించుకోవడంలేదని స్పష్టమవుతున్నది. ములుగు జిల్లా నుంచి ఒక్క విద్యార్థి కూడా దరఖాస్తు చేసుకోలేదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు నష్టపోకుండా చూడాలని ఎస్సీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గడువు దగ్గరపడుతున్న వేళ ఎస్సీ అభివృద్ధిశాఖ సెక్రటరీ జ్యోతీ బుద్ధప్రకాశ్ స్పందించారు. విద్యార్థులతో దరఖాస్తు చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు.