హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ) : దేశవ్యాప్తంగా జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి పదేండ్లకు ఒకసారి చేయాల్సి ఉండగా, 15 ఏండ్లయినా ఎందుకు చొరవ తీసుకోవడం లేదని నిలదీశారు. 2021లో దేశవ్యాప్తంగా జనగణన జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడిందని చెప్పారు. ఈ సంవత్సరంలో జనాభా లెకలు కచ్చితంగా జరుగుతాయని అందరూ భావించినా జరగలేదని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో మంగళవారం రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు సత్యనారాయణగౌడ్, లీగల్ సెల్ సభ్యులు సీ కల్యాణ్‌రావు, కావ్యశ్రీతో కలిసి వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. జనగణన జరిపితే ఆహార భద్రతా చట్టం పరిధిలోకి సుమారు 10 కోట్ల మందిని చేర్చాల్సి వస్తుందని ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదా? అని ప్రశ్నించారు. జనగణనతోపాటు కులగణన చేపట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తున్నందున రిజర్వేషన్లను పెంచాల్సి ఉంటుందని, డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుందని ప్రధాని మోదీ జనాభా లెకలు తీయడం లేదా? అని నిలదీశారు. 2019 బడ్జెట్లో జనగణన కోసం రూ.8 వేల కోట్లు కేటాయించి ఇపుడు కేంద్రం రూ.574 కోట్లు మాత్రమే కేటాయించడంతో అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు, సంక్షేమ పథకాల సమర్థ అమలుకు జనాభా లెకలు తప్పనిసరని చెప్పారు. ప్రధాని మోదీ దగ్గర ఏ లెకలూ లేక గుడ్డెద్దు చేలో పడ్డట్టు ముందుకు సాగుతున్నారని వినోద్‌కుమార్ విమర్శించారు.
దేశ ప్రధాని మోదీ తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని వినోద్‌కుమార్ మండిపడ్డారు. కులగణన నుంచి తప్పించుకునేందుకే మోదీ జనగణన చేయడం లేదనే అనుమానం కలుగుతున్నదని విమర్శించారు. ప్రతి పదేండ్లకు 15 శాతం జనాభా వృద్ధి ఉంటుందని గణాంకాలు చెప్తున్నాయని, ఈ లెక్కన దేశంలో కొత్తగా 20 కోట్ల మంది పెరుగుతారని, ఇందులో సుమారు 10 కోట్ల మంది పేదలు ఉంటారని, వీరంతా జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. జనగణన జరిపితే వీరందరికీ నిత్యవసరాలు, రేషన్ సరుకులు ఇవ్వడంతోపాటు ఉపాధి కల్పించాల్సి వస్తుందని మోదీ జనాభా లెకలు తీయడం లేదని విమర్శించారు. కులగణన చేస్తే కులాలవారీగా రిజర్వేషన్లు, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొత్త జనాభా లెకల ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం అమలు కావాలని, వాటిని మరో 20 ఏండ్లు వాయిదా వేసే కుట్ర జరుగుతున్నదని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో సోమవారం సోనియాగాంధీ ఆహార భద్రతా చట్టం గురించే మాట్లాడారు తప్ప జనాభా లెకలకు మహిళా రిజర్వేషన్లకు ఉన్న సంబంధం గురించి మాట్లాడలేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే జనాభా లెకలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేసి సరిపడా నిధులు కేటాయించాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.