హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): గత నెల 27న ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నెల మొదట్లోనే మరి కొంతమంది కార్యదర్శులతోపాటు జిల్లా కలెక్టర్ల బదిలీలు కూడా ఉంటాయనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది. దీనికి సంబంధించి బదిలీల జాబితా కూడా సిద్ధమైందనే ప్రచారం జరిగింది. కొత్త సీఎస్ రాకతో అన్ని స్థాయుల్లోని ఐఏఎస్ల బదిలీ లాంఛనమే అన్న చర్చ జరిగింది. అయితే తెర వెనుక ఏం జరిగిందో ఏమో గానీ ఐఏఎస్ల బదిలీలకు బ్రేక్ పడింది.
సీఎం, మంత్రుల మధ్య నెలకొన్న అగాధమే ఐఏఎస్ అధికారుల బదిలీ ఆగిపోవడానికి కారణమనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే సీఎం, మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలకు ఈ బదిలీల జాబితా ఆజ్యం పోసిందనే చర్చ జరుగుతున్నది. వాస్తవానికి పలు శాఖల కార్యదర్శులతోపాటు జిల్లా కలెక్టర్ల బదిలీలకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి ఓ జాబితాను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇక్కడే అసలు కథ మొదలైందనే చర్చ జరుగుతున్నది. మంత్రులతోపాటు కీలక నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే సీఎం రేవంత్రెడ్డి జాబితాను రూపొందించినట్టు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రులు, ఇతర కీలక నేతలు ప్రతిపాదించిన పేర్లను పూర్తిగా పక్కకు పెట్టినట్టు తెలిసింది. అయితే ఈ జాబితాలోని పేర్లు బయటికి రావడంతో మంత్రులు తీవ్ర ఆభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ జాబితానే ఫైనల్ చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
మంత్రులకు తెలియకుండా, వారికి సమాచారం ఇవ్వకుండా ఆయా శాఖల కార్యదర్శులను, ఇతర అధికారులను మార్చే ప్రక్రియకు సీఎం శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. దీంతో పాటు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల కలెక్టర్లను మార్చాలనీ సీఎం నిర్ణయించినట్టు సమాచారం. మేం మంత్రులమేనా? అన్నీ సీఎం చేసుకుంటే.. ఇక మేమెందుకు అంటూ మంత్రులు వ్యాఖ్యానించినట్టు చెప్పుకుంటున్నారు.
బదిలీలపై ముందుకు వెళితే గొయ్యి వెనక్కి వెళితే నుయ్యి అన్నట్టు సీఎం రేవంత్రెడ్డి పరిస్థితి తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులు సూచించిన పేర్లతో బదిలీలు చేస్తే పాలనా వ్యవస్థ తన చేజారిపోతుందమోనని సీఎం ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. సదరు అధికారులు తన మాట కాకుండా మంత్రుల మాటకే అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుందని, అప్పుడు ఎక్కువ ఇబ్బంది ఏర్పడుతుందనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు సమాచారం.