Farmers | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రైతులకు 24 గంటల విద్యుత్తు అక్కర్లేదని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 3 గంటలపాటు విద్యుత్తు సరిపోతుందని ఈఆర్సీ బహిరంగ విచారణలో ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ ప్రధానమైన తెలంగాణలో 24 గంటల కరెంట్ అవసరమే లేదని చెప్పడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
24 గంటలు మోటర్లు నడువాల్సిన అవసరం లేదని, మూడు గంటలు సరిపోతుందని, ఆ మూడు గంటలతో చివరిమడి వరకు నీరు పారుతుందంటూ చెప్పుకొచ్చారు. బోరు బావులకు తాము ప్రతిపాదించడంతోనే రూ.20 నుంచి రూ.30 చార్జీ చేస్తున్నారని తెలిపారు. అనేక సంస్కరణల్లో భాగంగానే రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నాలుగు రోజులు ఆలస్యమైనా పర్వాలేదని, అందరి సూచనలు తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని ఈఆర్సీని కోరారు.
ప్రభుత్వ, ప్రైవేట్ డిస్కమ్‌లు ఏర్పాటు చేయాలంటే ఈఆర్సీ అనుమతి తప్పనిసరి. ఈఆర్సీ లైసెన్స్ జారీచేస్తేనే డిస్కమ్‌లు కార్యకలాపాలు సాగించాలి. కానీ, తెలంగాణ రైతు డిస్కమ్ ఏర్పాటుకు మొదట్లోనే తప్పటడుగులు పడ్డాయి. లైసెన్స్ జారీ చేయకుండానే.. విచారణ సమయంలోనే సర్కార్ ఆర్పీడీసీఎల్ లోగోను విడుదల చేసింది. ఏకంగా ఈఆర్సీ బహిరంగ విచారణలోనే లోగోను విడుదల చేయడంపై పలువురు విస్మయం వ్యక్తంచేశారు.
జూన్ 2 నుంచి రైతు డిస్కమ్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ప్రభుత్వం చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈఆర్సీ అనుమతించకుండానే ఎలా చెప్తారంటూ బీఆర్ఎస్ నేతలు సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీనికి డిస్కమ్ నుంచి, ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది. రైతు డిస్కమ్ ఏర్పాటుపై బహిరంగ విచారణను భారీ బందోబస్తు నడుమ చేపట్టారు. ఉద్యోగులు, రైతులు వ్యతిరేకిస్తుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. కొంతసేపు మీడియా ప్రతినిధులను సైతం అనుమతించలేదు.