హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉన్నప్పుడే నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానో? ఈ ప్రభుత్వం కామెడీగా ఉన్నది. మేము కూడా కామెడీగానే ఉన్నాం’.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. ఓ ఎమ్మెల్యే. అది కూడా సీఎం రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) సన్నిహితంగా మెదులుతారని పేరున్న ఎమ్మెల్యే కావడం మరీ విశేషం. దీనిని బట్టే రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, ఎమ్మెల్యేల మనోగతం అర్థం చేసుకోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే గురువారం సచివాలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా తనను కలిసిన జర్నలిస్టులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ‘కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానో’ అంటూ నిట్టూర్పు చెందారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేకన్నా ముందో, తర్వాతనో నేను ఎమ్మెల్యే అయితే బాగుండేది కదా’ అంటూ ఆ కొత్త ఎమ్మెల్యే ఆవేదన చెందడం గమనార్హం. ‘ఈ ప్రభుత్వం కామెడీగా ఉన్నది. మేము (ఎమ్మెల్యేలం) కూడా కామెడీగానే ఉ న్నాం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంతోషం కూడా లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయం చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఒక్కపని కూడా కావడం లేదని వాపోయారు.
కనీసం కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేకపోతున్నామని, దీంతో వారి వద్ద తాము చులకనవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు, సీఎం రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యానికి ఈ ఘటన అద్దం పడుతున్నదని సచివాలయ వర్గాల్లో చర్చ జరిగింది. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే అలా వ్యాఖ్యానించారంటే ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకన్నా పరాకాష్ట ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ పరిస్థితి ఆ ఒక్క ఎమ్మెల్యేదే కాదని, కాంగ్రెస్‌లో గెలిచిన, కాంగ్రెస్‌లోకి జంప్ అయిన అందరు ఎమ్మెల్యేలదీ అదే పరిస్థితి అని పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్నామనే మాటే తప్ప, దానికి తగ్గ ప్రయోజనాలేమీ తమకు అందడం లేదంటూ వాపోతున్నారు.