హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు వ్యవహారంపై నాన్చుడు ధోరణి ఎందుకు అవలంబిస్తున్నారని తెలంగాణ అడ్మిషన్, ఫీజు నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)ని హైకోర్టు నిలదీసింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు 2022-23 నుంచి 2024-25 బ్లాక్ పీరియడ్‌లోని ఫీజులే 2025-26కు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30న జీవో జారీచేసింది. దీనిపై గురునానక్, గోకరాజు రంగరాజు తదితర కాలేజీలు గరువారం దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ జరిపారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలోని 15 మంది సభ్యులున్న కమిటీ కాలేజీల ఫీజుల పెంపు ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునేందుకు ఉన్న అడ్డంకులు ఏమిటని జస్టిస్ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఫీజులపై నిర్ణయం తీసుకుంటే ఆడ్మిషన్లు చేపట్టాలని, ఆపైన ప్రభుత్వం ఫీజు రియంబర్స్ చేయాల్సి వుంటుందని, ఫీజుల రియంబర్స్మెంట్ కాకపోతే కాలేజీలు మూతపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మార్చిలో నోటిఫై చేసినప్పుడు కాలేజీలు వెంటనే ఎందుకు ఫాలోఅప్ చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. కౌన్సెలింగ్ పూర్తయి ఆడ్మిషన్ల సమయంలో హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఫీజుల పెంపు వ్యవహారానికి సంబంధించి కాలేజీలతో నిర్వహించిన సమావేశ రిజిస్టర్‌ను 4 గంటల్లో అందజేయాలని ఆదేశించారు.
టీఏఎఫ్ఆర్సీ తరఫున సీనియర్ న్యాయవాది పీ శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ కాలేజీలు ఫీజు పెంపు ప్రతిపాదనలు సమర్పించాయని చెప్పారు. గత బ్లాక్ పీరియడ్‌లో వసూలు చేసిన మొత్తాన్నే ఈ ఏడాదికి రాష్ట్రం సిఫారసు చేసినట్టు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాహుల్‌రెడ్డి వాదిస్తూ, కొన్ని కాలేజీలు 90 శాతం ఫీజు పెంపు ప్రతిపాదనలు పంపాయని, ఈ దశలో ఉత్తర్వులు జారీచేస్తే 1.06 లక్షల మంది ఇంజినీరింగ్, 38 వేల ఎంసీఏ, ఎంబీయే విద్యార్థులపై భారం పడుతున్నందున మధ్యంతర ఉత్తరులు జారీ చేయవద్దని కోరారు. వాదనల తర్వాత న్యాయమూర్తి, శుక్రవారం ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించారు.