హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఉన్న బెల్ట్‌షాపుల్లో మద్యం ఏరులై పారుతుంటే, వాటిని ఎత్తివేసేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము వివిధ జిల్లాల్లో పర్యటనలకు వెళ్లిన సందర్భంలో గ్రామాల్లోని మహిళలు బెల్టుషాపులపై ఫిర్యాదులు చేస్తున్నారని కమిషన్ పేర్కొన్నది. మహిళలు చేసిన ఫిర్యాదులను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. శుక్రవారం ఆబ్కారీ భవన్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్‌తో కలిసి కమిషన్ సభ్యులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులతో కమిషన్ సభ్యులు మాట్లాడారు. అనంతరం చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బదిలీలు, ప్రమోషన్లలో అగ్రవర్ణాలు అడ్డుపడితే ఊరుకునేది లేదని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పారు.
తండాల్లో నాటుసారా ప్రభావంతో చాలామంది చనిపోతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కల్తీ కల్లును అరికట్టడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని, చనిపోయినవారి కుటుంబాలకు తక్షణం ఎక్స్‌గ్రేషియాను చెల్లించేలా ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని సూచించారు. ఈ విషయంలో తాను కూడా ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బాబు జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ జయంతి, వర్థంతిని నిర్వహించాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మద్యం ఎంఆర్పీ కంటే ఎకువ ధరలకు అమ్ముతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని అదేశించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, ఎన్ రాంబాబునాయుడు, అడిషనల్ కమిషనర్ ఖురేషీ, ఈడీ చరణ్‌దాస్, శంకర్‌తోపాటు డిప్యూటీ కమిషనర్లు దశరథ్, అంజన్‌రావు, డేవిడ్ రవికాంత్, ఏ శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.