Assembly Budget Session | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల రంగంపై శాసనసభలో సోమవారం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సోమవారం చర్చ ప్రారంభంకానున్నది. దీంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన లోపాలపై సభలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయింంచినట్టు తెలిసింది. ఈ మేరకు అధికార కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో ‘ప్రాజెక్టుల నిర్మాణం-అవకతవకలు’ అనే అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగింత అంశంలో ప్రతిపక్షం చేసే విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనే వ్యూహంపై సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించ తలపెట్టిన బహిరంగసభలో చేసే విమర్శలపైనా ఎదురుదాడి చేయాలని సూచించినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణ లోపాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని సూచించినట్టు తెలిసింది. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు ఈ నెల 13న ప్రభుత్వం కార్యక్రమం ఖరారు చేసి ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు తిరస్కరించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్రావు ముఖ్యమంతి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆదివారం సాయంత్రం సీఎం నివాసానికి స్వయంగా వెళ్లి కలిశారు.