అచ్చంపేట, మార్చి 24 : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు గురువారం సీఎం కేసీఆర్కు ఫోన్చేశారు. అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీరు అందించే పథకానికి శంకుస్థాపన చేయాలని కోరగా అందుకు సీఎం అంగీకరించినట్టు పేర్కొన్నారు. గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బల్మూరు మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో గువ్వల సమావేశం నిర్వహించారు. బల్మూరు మండలానికి సాగునీరందించే ఉమామహేశ్వర రిజర్వాయర్ పనులు ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉన్నదని పలువురు ఆయన్ను అడిగారు. వెంటనే ఆయన సీఎం కేసీఆర్కు ఫోన్ చేసి మాట్లాడారు. వచ్చే నెల అచ్చంపేటకు వస్తున్నట్టు కేసీఆర్ తనతో చెప్పినట్టు గువ్వల పేర్కొన్నారు. ఉమామహేశ్వరం, చెన్నకేశవ రిజర్వాయర్ పనులు చేద్దామన్నట్టు తెలిపారన్నారు.