ప్రభుత్వ దవాఖానల ఉద్యోగుల కడుపు మాడుతున్నది. కష్టపడి పనిచేస్తున్నా నెలలతరబడి వేతనాలు రాక పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. అధికారంలోకి వస్తే ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్న హామీకి కాంగ్రెస్ మంగళం పాడడం శాపమవుతున్నది. ముఖ్యంగా కరీంనగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన, మెడికల్ కాలేజీలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కొక్కరికి మూడు నుంచి ఆరు నెలలు, అలాగే ఆరోగ్య శ్రీ సిబ్బందికి ఎనిమిది నెలలుగా జీతాలు రాక కుటుంబాలు ఆగమవుతుండగా, ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాల్సి ఉంది.
కరీంనగర్ విద్యానగర్, జూలై 6: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ప్రకటనలకే పరిమితమైంది. ఒకటో తేదీ కాదు అసలు మూడు నాలుగు నెలలైనా ఇవ్వలేని ధైన్యంలో మగ్గుతున్నది. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. వారధి పరిధిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ దవాఖానలో మొత్తం 103 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా, మూడు నుంచి ఆరు నెలల తరబడి జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ విభాగంలో మొత్తం 11 పోస్టులు ఉండగా, ప్రస్తుతం కేవలం తొమ్మిది మందే పనిచేస్తున్నారు.
గతంలో ఏడాది పాటు పెండింగ్లో ఉన్న వేతనాల్లో కొంత మొత్తాన్ని విడుదల చేశారని, ప్రస్తుతం మళ్లీ ఎనిమిది నెలల జీతాలు పెండింగ్లోనే ఉన్నాయని, ఇలా అయితే బతికేది ఎలా..? కొలువులను వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎన్హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంటే అధికారులు మాత్రం వాటిని అమలు చేయడం లేదని ఉద్యోగులు, సిబ్బంది ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి నెలా ఒకటో తేదీ వేతనాలిస్తామన్న హామీని అమలు చేయాలని, కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
అవస్థలు పడుతున్నాం
నెలల తరబడి జీతాలు రాక అవస్థలు పడుతున్నాం. కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భారంగా మారాయి. చాలా ఇబ్బందిగా ఉంది. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తున్నా మా వేతనాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నరు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ శాలరీలు విడుదల చేయాలి.
– కొంకటి ప్రదీప్, ఎంఎన్వో
ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి
నేను కరీంనగర్ దవాఖాన ఐసీయూలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నా. మూడు నెలలుగా జీతం అందలేదు. ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి వచ్చింది. పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులన్నీ అప్పుల మీదే నడుస్తున్నాయి. దవాఖానలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నా మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు. వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేసి ప్రతి నెలా సమయానికి జీతాలివ్వాలి.
– మడక కుమారస్వామి, సెక్యూరిటీ గార్డ్ (ఐసీయూ)
ఎనిమిది నెలలుగా వేతనాల్లేవు
ఆరోగ్యశ్రీ విభాగంలో నిరంతరం రోగులకు సేవలందిసున్నాం. కానీ ఎనిమిది నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ అవసరాలు తీర్చడం కష్టమైపోయింది. అప్పులు చేయకతప్పడం లేదు. ప్రభుత్వం ఉద్యోగుల సేవలను గుర్తించి వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి. ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితులు రాకుండా చూడాలి.
– పిట్టల అభిలాష్, ఫార్మసిస్ట్ (ఆరోగ్యశ్రీ)