హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసిన్లో క్రమంగా వరద తగ్గుముఖం పడుతుండగా.. గోదావరి బేసిన్లో అంతకంతకూ పెరుగుతున్నది. తెలంగాణతోపాటు, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో వారం రోజులుగా ఉప్పొంగిన కృష్ణమ్మ ప్రస్తు తం నెమ్మదిస్తున్నది. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టుకు 4.50 లక్షల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రానికి 2.40 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలకు ప్రస్తుతం 211 టీఎంసీలకు చేరుకున్నది. ఈ క్రమంలో ఎగువ నుంచి వస్తున్న వరదను అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.
గోదావరిలో వరద క్రమంగా పెరుగుతున్న ది. రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే గోదావరిలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎగువన మహారాష్ట్ర గైక్వాడ్ నుంచి కేవలం 57 వేల క్యూసెక్కులు వస్తుండగా.. సింగూరు, నిజాంసాగర్‌తోపాటు రాష్ట్రంలోని స్థానిక వాగుల ద్వారా ఎస్సారెస్పీకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఆదివారం సాయంత్రానికి 1.75 లక్ష ల క్యూసెక్కులు నమోదైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. పార్వతి, సరస్వతి బరాజ్‌ల వద్ద వరద క్రమంగా పెరుగుతున్నది. లక్ష్మీ బరాజ్ వద్ద 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది. ఆదివారం ఉదయం 8 గం టలకు 31.5 అడుగులు ఉన్న నీటిమట్టం సాయంత్రం 6 గంటలకు 36.1 అడుగులకు చేరుకున్నది.కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 9.12 మీటర్ల ఎత్తులో 5.5 లక్షల క్యూసెక్కు లుగా ప్రవహిస్తున్నది.