CM KCR | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటికే తొలి విడత గొర్రెల పంపిణీ పూర్తి కాగా, శుక్రవారం నుంచి రెండో విడత మొదలు కానున్నది. అర్హులైన గొల్ల కురుమల జాబితాను పశు సంవర్ధకశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. మంచిర్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గొర్రెల పంపిణీని శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. నల్లగొండ జిల్లాలో పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులకు గొర్రెలు అందజేశారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
అర్హులైన గొల్ల కురుమలందరికీ ఒక్కొక్కరికి ఒక యూనిట్ (21) గొర్రెలను పంపిణీ చేస్తున్నారు. మొత్తం 7.61 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వీరందరికీ రూ.11వేల కోట్లతో రెండు విడతల్లో గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడత గొర్రెల పంపిణీ పూర్తి కాగా, రెండో విడత శుక్రవారం నుంచి మొదలు కానున్నది. గొర్రెల పంపిణీకి పశు సంవర్ధకశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులను గుర్తించడంతోపాటు ఎక్కడెక్కడి నుంచి గొర్రెలను తీసుకురావాలనేదానిపై కసరత్తు పూర్తి చేశారు.
రెండో విడతలో రూ.6,085 కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేయనున్నారు. ఇందులో ప్రభుత్వ వాటా రూ.4,563 కోట్లు కాగా లబ్ధిదారుల వాటా రూ.1,521 కోట్లుగా ఉన్నది. గొల్ల కురుమల కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసి వారికి లబ్ధి చేకూరేలా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే. ఈ పథకం తొలినాళ్లలో యూనిట్ ధర రూ.1.25 లక్షలు గా కాగా, మార్కెట్లో గొర్రెల ధర పెరగడంతో లబ్ధిదారులపై భారం పడకుండా ఒక్కో యూని ట్ ధరను రూ.1.75 లక్షలకు ప్రభుత్వం పెం చింది. గొర్రెలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఒ కో గొర్రెకు రూ.5 వేల బీమా ఇస్తుంది. పొట్టేలుకు రూ.7 వేలను అందిస్తున్నది. దేశంలో అత్యధిక గొర్రెలు గల రాష్ట్రంగా తెలంగాణ టాప్‌లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణలో గొర్రెల సంఖ్య 1.28 కోట్లు ఉండగా, ఇప్పుడు ఇది 1.91 కోట్లకు పెరిగింది. తెలంగాణ తర్వాత 1.76 కోట్ల గొర్రెలతో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో, 1.10 కోట్ల గొర్రెలతో కర్ణాటక మూడో స్థానంలో నిలిచాయి.
గొర్రెల పంపిణీలో అర్హులకు 100 శాతం లబ్ధి జరిగేలా పారదర్శకతకు పెద్దపీట వేశా రు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను, మొబైల్ యాప్‌ను రూపొందించారు. గొర్రెల కొనుగోలు ప్రాంతానికి అధికారులతోపాటు లబ్ధిదారులను కూడా తీసుకెళ్లి నచ్చిన గొర్రెలను ఎంచుకునేలా ఏర్పాట్లు చేశారు. రీసైక్లింగ్ లేకుండా ట్రాన్స్పోర్ట్ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ పెట్టారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం నెరవేరింది. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలతో సుమారు రూ.8 వేల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేసింది. తద్వారా వీటికి 1.35 కోట్ల గొర్రె పిల్లలు జన్మించాయి.