హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలకు అభ్యర్థుల ఆలస్యం ప్రామాణికతపై స్పష్టత కొరవడింది. రాష్ట్రంలో ఎప్సెట్, ఎడ్సెట్, ఐసెట్ సహా మొత్తం 7 ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యం నిబంధనను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించడంలేదు. కానీ కొన్ని పరీక్షాకేంద్రాల్లో ప్రాంగణంలోని వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన హాల్ గేట్ వద్ద నిమిషం నిబంధన అమలు చేస్తుండగా, మరికొన్ని సెంటర్లలో మెయిన్ గేట్ వద్ద ఎంట్రీని పరిగణలోకి తీసుకుంటున్నారు. గతంలో పలు సెంటర్లలో ఈ సమస్య ఏర్పడింది. మే, జూన్లో ఎప్సెట్, ఐసెట్, ఎడ్సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 3 నుంచి జరగనున్న సెట్ కమిటీ సమావేశాల్లో నిమిషం నిబంధన ఏ గేట్ వద్ద పరిగణలోకి తీసుకుంటారో స్పష్టతనివ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.