హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) తేల్చిచెప్పింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలోని అనేక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. కానీ ట్రిబ్ మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కోర్టు ఆర్డర్ కాపీలను పట్టుకొని అభ్యర్థులు బోర్డు చుట్టూ తిరుగుతుండగా, బోర్డు మాత్రం ప్రభుత్వానికి అన్ని అంశాలను నివేదించామని, నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని చేతులెత్తేసింది. దీనిపై అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో తొమ్మిది క్యాటగిరీల్లో (పీజీటీ, టీజీటీ, జేఎల్, డీఎల్, పీడీ, లైబ్రేరియన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్) మొత్తం 9210 పోస్టుల భర్తీకి ట్రిబ్ చర్యలు చేపట్టింది. గత ఆగస్టులోనే రాత పరీక్షను నిర్వహించగా, ఈ ఫిబ్రవరిలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్టులు మినహా దాదాపు 8700 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్, డెమోల నిర్వహణ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రిలిక్విష్మెంట్ లేకుండా నియామకాలను చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా కామన్ పేపర్‌ను పెట్టి, అవరోహణ క్రమంలో పోస్టుల భర్తీ చేపట్టకుండా, ఆరోహణ పద్ధతిలో ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా, ఒక అభ్యర్థి 3 లేదా 4 ఉద్యోగాలకు ఎంపికయ్యారని, అందువల్ల 2000 పోస్టులకు పైగా ఖాళీలు ఏర్పడే పరిస్థితి ఏర్పడిందని కోర్టుకు విన్నవించుకున్నారు. గతంలో ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. ఒకరు ఉద్యోగానికి ఎంపికైనవారు ఆ పోస్టులో చేరకపోతే, వాటిని ఆ తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ట్రిబ్ చేపట్టిన విధానం వల్ల వేలాది పోస్టులు బ్యాక్లాగ్ ఏర్పడడమేగాక, వేల మంది తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని అభ్యర్థులు కోర్టు ఎదుట ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. దీంతో హైకోర్టు గురుకుల అభ్యర్థులకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. గురుకుల నియామకాల్లో మి గిలిపోతున్న ఉద్యోగాలన్నిటినీ తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు రెండు నెలలు అవుతున్నా ఇప్పటికీ ట్రిబ్ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
లైబ్రరీ, జేఎల్ పోస్టుల పరిస్థితీ అంతే..
ఇతర పోస్టులకు సంబంధించి కూడా ఇదే దుస్థితి నెలకొన్నది. ట్రిబ్ చేపట్టిన జేఎల్ బోటనీ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లో మైక్రోబయాలజీ అభ్యర్థులు అర్హులని ప్రకటించినా డెమోలకు అనుమతించలేదని ఆరోపిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు విరుద్ధంగా ట్రిబ్ నియామకాలు చేపట్టిందని ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు, అర్హతలేని వారిని ఎంపిక చేశారని లైబ్రేరియన్ అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించారు. జేఎల్ బోటనీ అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది.