సుష్మాస్వరాజ్ మద్దతు ఇచ్చిన సంగతి తెలియదా?
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి
ఖైరతాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణ ఏర్పాటు సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ చరిత్ర పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి విమర్శించారు. బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, తెలంగాణ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. చర్చల ద్వారా, అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ఏర్పడిందని, నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ సంపూర్ణ మద్దతు ఇచ్చారన్న విషయం మోదీకి తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రంపై ప్రధాని సవతితల్లి ప్రేమ చూపించడం సరికాదని హితవు చెప్పారు. దేశ స్వాతం త్య్రం పోరాటం, తెలంగాణ ఉద్యమం, భారత రాజ్యాంగం రచన, భారతదేశ నిర్మాణంలో బీజేపీ భాగస్వామ్యమే లేదని గజ్జెల కాంతం పేర్కొన్నారు. మత కలహాలు సృష్టించడం తప్ప బీజేపీకి మరేమీ తెలియదని దెప్పిపొడిచారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకే ఇలాంటి వ్యాఖ్యలకు దిగారని మండిపడ్డారు. తెలంగాణ పట్ల బీజేపీ హృదయంలో ఉన్న వివక్షకు మోదీ వ్యాఖ్యలు నిదర్శనమని రాజారాం యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ విలీనంతో పాటు నేటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు బీజేపీ నాయకుల భాగస్వామ్యమే లేదని చెప్పారు. సమావేశంలో టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు, వినోద్, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.