ఖైరతాబాద్, జూలై 10 : ‘రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ వస్తుందని కండ్లలో ఒత్తులు వేసుకొని చూశారు.. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు అడిగితే నిర్భందాలు చేస్తున్నారు’ అని గ్రూప్ 2, 3 అభ్యర్థులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో అభ్యర్థులు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
మఠం శివానంద స్వామి, మహేశ్, స్రవంతి, సింధురెడ్డి, ఈశ్వర్, దామోదర్‌రెడ్డి, క్రాంతికుమార్ మాట్లాడుతూ ఇదే సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్-1, 2, 3 పోస్టులు పెంచుతామని, పరీక్షలకు స్పష్టమైన గడువు ఉండేలా చూసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంపునకు మార్చి 6న సర్క్యూలర్ మెమో జారీ చేసిందని, దాని ప్రకారం సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. గ్రూప్ -1 మెయిన్స్ రాసిన వెంటనే గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలు రాయాల్సి ఉంటుందని, తద్వారా లక్షలాది మంది అభ్యర్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రియాజ్‌లను అనేక సార్లు కలిసినా ఎలాంటి ఫలితంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగుల సమస్యలపై బక్క జడ్సన్, అశోక్ చేస్తున్న ఆమరణ దీక్షలను విరమింపచేయాలని కోరారు. గ్రూప్ 2, 3 పరీక్షలను డిసెంబర్లో నిర్వహించడం వల్ల ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేసినట్టవుతుందని, ఆ మేరకు టీజీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.