హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం గౌడన్నల పాలిటశాపంగా మారిందని గౌడజన హక్కుల పోరాట సమితి విమర్శించింది. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్లో ఉన్న కొందరు గౌడ నేతలు.. ప్రస్తుత పాలకులకు గౌడన్నల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడింది. ఈ మేరకు గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యెలికట్టె విజయ్కుమార్గౌడ్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కాంగ్రెస్ సర్కారుపై ప్రశ్నాస్ర్తాలు సంధించారు. గౌడ సొసైటీలకు మద్యం షాపులలో 25 శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చి, తాజాగా విడుదల చేసిన గెజిట్లో ఆ సంగతి ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు.
ప్రమాదవశాత్తు మరణించిన గౌడన్నల కుటుంబాలకు రూ.5 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతామన్న కాంగ్రెస్ మాట ఏమైనదని నిలదీశారు. జనగామ జిల్లాకు పాపన్నగౌడ్ పేరు పెడతామన్న హామీపై పాపన్నగౌడ్ జయంతి సభలో ప్రభుత్వ పెద్దలు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తాటి, ఈత చెట్లు పెట్టుకోవటానికి 560 జీవో అమలు చేస్తామన్న హామీ సంగతేంటని నిలదీశారు. ఆబారీశాఖ, పోలీసు బలగాలతో దాడులు చేసి, కల్లుగీత కార్మికులను భయబ్రాంతులకు గురిచేసి.. 67 దుకాణాలు మూసివేయడంపై చర్చకు వచ్చే దమ్ముందా? అని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ఆత్మగౌరవ పరిరక్షణ, హామీల అమలు, హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని గౌడ సమాజానికి పిలుపునిచ్చారు.