ఖైరతాబాద్, నవంబర్ 9: అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో మోదీ ఇచ్చిన హామీ ఏమైందని తెలంగాణ రాష్ట్ర విద్యార్థ్ధి సంఘాలు నిలదీశాయి. ‘ప్రధాని మోదీ ఈ ఎనిమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలివ్వాలి. ఆ ఉద్యోగాలు ఎటు పోయాయి? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ మాటేమిటి? విభజన హామీలు ఏం చేశారు? వీటికి సమాధానం చెప్పిన తర్వాతే మోదీ తెలంగాణలో అడుగు పెట్టాలి. లేని పక్షంలో మా శక్తిని చూపిస్తాం. 12న రామగుండం అగ్నిగుండమే అవుతుంది’ అని హెచ్చరించాయి.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలని అన్ని ప్రధాన విద్యార్థి సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయని చెప్పారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో నల్లజెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన బిల్లుపై సంతకం పెట్టకుండా బీజేపీ ఏజెంట్‌గా పనిచేస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై తీరును నిరసిస్తూ రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
గిరిజన వర్సిటీ హామీ ఏమైంది మోదీ?
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన తర్వాతనే ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఉన్న ఐఐటీ, ఐఐఎన్, ట్రిపుల్ఐటీ వంటి విద్యాసంస్థలను స్థాపించకుండా మొండిచెయ్యి చూపిందన్నారు. గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌నాయక్ మాట్లాడుతూ.. తొమ్మిది సార్లు తెలంగాణకు వచ్చిన మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారో స్పష్టం చేయాలని అన్నారు.
బీసీల జనాభాను తేల్చరెందుకు?
దేశ జనాభాలో బీసీల సంఖ్యను కేంద్రం తేల్చడం లేదని బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ యల్చాల దత్రాత్రేయ మండిపడ్డారు. సమావేశంలో బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకట్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు, కార్యదర్శులు నాగరాజు యాదవ్, కాటం శివ, రాష్ట్ర నాయకులు డాక్టర్ మందా సురేశ్, షిగా వెంకట్ గౌడ్, ఓయూ జేఏసీ చైర్మన్ బండారు వీరబాబు, ఎంఎస్ఎఫ్ నేత నాగరాజు, మైనార్టీ విద్యార్థి సంఘం నేత రహమాన్ పాల్గొన్నారు.