కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాలు గుర్తుకు వస్తాయి. చిన్నా, పెద్దా, అని వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ సరదాగా ఆట, పాటలతో, భక్తి భావంతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టునీడన భోజనం చేస్తుంటారు. ఆనందం, ఆహ్లాదకరంగా సాగే వనభోజనాలు మన సంప్రదాయాలను చాటిచెబుతాయి. బంధువులు, స్నేహితులతో కలిసి చెట్ల నీడలో భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. హైదరాబాద్‌కు సమీపంలో వన భోజనాలు చేసేందుకు అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఏమున్నాయో ఓ లుక్కేద్దాం మరి.
ప్రగతి రిసార్ట్స్ : చిల్కూరి బాలాజీ టెంపుల్ రోడ్డులో ప్రగతి రిసార్ట్స్ ఉంది. ఇది నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు కార్తీక వనభోజనాలకు అవకాశం ఉంటుంది. ఉసిరి చెట్టు కింద కూర్చొని అరటి ఆకులో భోజనం చేసేందుకు వీలుంటుంది. వడియాలు, పూర్ణాలు, గారెలు, చట్నీ, సాంబారు, రసం, పెరుగు, పులిహోరతో పాటు ఇతర వంటకాలను వడ్డిస్తారు. ప్రగతి రిసార్ట్‌లోకి వెళ్లాలంటే పెద్దలు రూ. 1100, పిల్లలకు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది.
అనంతగిరి హిల్స్ : ఇది తెలంగాణలో ఒక దట్టమైన అటవీ ప్రాంతం. పచ్చని అడవుల్లో వంట చేసుకునే, వన భోజనాలు చేయొచ్చు. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంది. హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
కీసరగుట్ట : కీసరగుట్టలో కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అక్కడ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం వన భోజనాలు చేయొచ్చు. ఈసీఐఎల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది కీసరగుట్ట. ఈ ప్రాంతంలో గ్రామీణ వాతావరణం ఉట్టిపడుతోంది.
వనస్థలి హిల్స్ : నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న వనస్థలి హిల్స్.. వన భోజనాలకు మంచి ప్రదేశం అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద చెట్లు, బండరాళ్లు ఉంటాయి. పెద్ద పెద్ద వృక్షాల కింద సరదాగా ఎంజాయ్ చేస్తూ వన భోజనాలు చేయొచ్చు.
ఇక హైదరాబాద్ నగరంలో అయితే ఇందిరా పార్క్, శిల్పారామం, జూపార్కు, సంజీవయ్య పార్కుకు వన భోజనాలకు వెళ్లొచ్చు.