దేవరకొండ, డిసెంబర్ 26 : కేంద్రం ఇస్తానన్న ఉద్యోగాలు ఎక్కడా పోయాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తానంటున్నది నిరుద్యోగ దీక్ష కాదని.. సిగ్గులేని దీక్ష అని ఎద్దేవాచేశారు.హైదరాబాద్‌కు వస్తున్న ఐటీ, ఇతర కంపెనీలను చూసి కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడాలని సూచించారు. ఆదివారం నాగార్జునసాగర్ వెళ్తూ మార్గమధ్యలో నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రం పరిధిలో ఉన్న 15 లక్షల ఉద్యోగాల ఖాళీలను ప్రధాని మోదీతో మాట్లాడి భర్తీ చేయించాలని బీజేపీ రాష్ట్ర నేతలకు సూచించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేశారని, కేంద్ర ఉద్యోగాలపై బండి సంజయ్ శ్వేత పత్రం విడుదల చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు చేతనైతే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ అభివృద్ధికి నిధులు వచ్చేలా ఇక్కడి బీజేపీ నాయకులు కృషి చేయకుండా.. రాష్ర్టానికి వచ్చే నిధులను ఇవ్వకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అందిస్తున్నారని.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమం ఎలా ఉందో ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.