హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలకు చేపట్టిన మరమ్మతులు నత్తనడకన కొనసాగుతున్నాయి. వానకాలం సమీపిస్తున్నా ఇప్పటికీ చాలాచోట్ల పనులు చేపట్టలేదు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) పనులపై ప్రభుత్వానికి ప్రణాళికనేది లేకుండా పోయింది. కాలువలు, తూములు, పంప్‌హౌజ్‌లు, ప్రాజెక్టుల గేట్లు తదితర మరమ్మతుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓఅండ్ఎం విభాగాన్ని గత ప్రభుత్వం ఏర్పా టు చేసింది. ఏఈ నుంచి సీఈల వరకు ఆర్థిక అధికారాలను బదలాయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు రూ.305.42కోట్ల అంచనా వ్యయంతో 1254 పనులకు ఓఅండ్ఎం కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 31.57 శాతం పను లు మాత్రమే పూర్తయ్యాయి. ప్రభుత్వం ఆశించిన మేర నిధులు విడుదల చేయకపోవడం తో మరమ్మతులు మందకొడిగా సాగుతున్నాయని ఇంజినీరింగ్ అధికారులు చెప్తున్నారు.
ఓఅండ్ఎం పనులను సాధారణంగా వేసవిలోనే చేస్తారు. వర్షాకాలలో నిత్యం వానలు, బురదవల్ల ప్రాజెక్టు పనులకు అడ్డంకి ఏర్పడుతుంది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఉంటాయి కాబట్టి శీతాకాలంలోనూ పనులకు ముందుకు సాగవు. దీనికితోడు తైబందీ నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి పనుల నిర్వహణ కష్టమే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం తెలిపిన 1254 పనుల్లో ఇప్పటి వరకు 396 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 359 పనులు పురోగతిలో ఉన్నాయి. 500 పనులు అసలు మొదలే కాలేదు. అగ్రిమెంట్ స్టేజ్‌లో 146, టెండర్ దశ లో 212 ఉండగా, 141 పనులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. ఇలానే సాగితే జూన్ నాటికి పూర్తికావడం కష్టమే.
నిరుడు భారీ వరదలకు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాలో పదుల సంఖ్యలో చెరువులు తెగిపోతే తాత్కాలిక మరమ్మతులు చేసి శాశ్వత మరమ్మతులకు అనుమతులు ఇచ్చారు. అందుకు సంబంధించిన పనులు ఇప్పటికీ ప్రారంభించలేదు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కరత్వాడ సమీపంలోని రాముని చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం రూ. 61.40లక్షలు మంజూరు చేసింది. టెండర్లు ఎప్పుడో పూర్తయినా వారం క్రితమే మట్టితీత పనులు ప్రారంభమయ్యా యి. ఇప్పటి వరకు ప్రధాన పనులే ప్రారంభం కాలేదు. కాకతీయ కెనాల్ డిస్ట్రిబ్యూటరీలపై క్రాస్ రెగ్యులేటర్లు/ఓటీల మరమ్మతులకు రూ. 1.84 కోట్లు మంజూరు చేయగా ఆ పనుల్లోనూ తీవ్ర జాప్యం నెలకొన్నది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి 77.658 కిలోమీటర్ వద్ద 21వ మేజర్ ఆఫ్ టేక్ స్లూ యిస్, లక్నవరం చెరువు 3 చానళ్లతోపాటు, స్వర్ణ, సుద్దవాగు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో వజీరాబాద్ డిస్ట్రిబ్యూటరీ, కాకతీయ కెనాల్ నుంచి కేసముద్రానికి సాగునీటిని అందించే డీబీఎం 48, రాజోలిబండ డైవర్షన్ స్కీంలలోని పనులు మరమ్మతుల్లో జాప్యానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
ప్రాజెక్టుల్లో వెంటనే చేపట్టాల్సిన అత్యవసర పనుల విషయంలోనూ ప్రభుత్వం ఉదాసీనం గా వ్యవహరిస్తున్నది. అందుకు కడెం ప్రాజెక్టు ప్రత్యక్ష ఉదాహరణ. నిరుడు ప్రాజెక్టుకు దా దాపు 5 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో స్పిల్‌వేలో 11వ నెంబర్ గేటు దెబ్బతిన్నది. డివైడింగ్ వాల్‌తోపాటు, ఆప్రాన్ పోర్షన్ కూడా కొన్ని చోట్ల ధ్వంసమైంది. రూ. 1.44 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రాజె క్టు ఎలక్ట్రిఫికేషన్ తదితర పనులకు మరో రూ.5 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఆ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన క్రెస్ట్‌గేట్ల పనులు, ఎస్సారెస్పీ గేట్ల రోప్స్‌ను మార్చడం, జూరాల ప్రాజెక్టు మరమ్మతులు కూడా నత్తనడకనే కొనసాగుతున్నాయి.
ఓఅండ్ఎం పనులను సాధారణంగా చిన్న గుత్తేదారులు నిర్వహిస్తుంటారు. కాంపోనెంట్ల వారీగా మరమ్మతులు పూర్తిచేసిన కొద్దీ అం దుకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తేనే తదుప రి పనులు ముందుకు కదులుతాయి. ప్రభు త్వం నిధులు విడుదల చేయకపోవడమే పను లు మందకొడిగా కొనసాగడానికి ప్రధాన కారణమని ఇటు క్షేత్రస్థాయి ఇంజినీర్లు, అటు గుత్తేదార్లు చెప్తున్నారు. ప్రస్తుతం రూ. 24కోట్ల మేర పనులు మాత్రమే పూర్తయ్యాయి. రూ.152 కోట్లతో చేపట్టిన పనులు పురోగతి లో ఉన్నాయి. మిగిలిన పనులను చేపట్టేందు కు 106.54కోట్లు విడుదల చేయాల్సి ఉంది.
ఒకవైపు నిధుల లేమీ, మరోవైపు ఆయా పనులను ఆమోదించి చేపట్టేందుకు ఇంజినీర్ అధికారులు జంకుతున్నారు. ప్రాజెక్టుల మరమ్మతులు, మెయింటెనెన్స్ పనుల్లో జాప్యం నెలకొనవద్దనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఅండ్ ఎం విభాగాన్ని ఏర్పాటు చేసింది. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చీఫ్ ఇంజినీర్ల స్థాయిలోనే ఓఅండ్ఎం కమిటీ సమావేశా న్ని నిర్వహించుకుని పనులను ఆమోదించుకు ని, చేపట్టుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం 19 టెరిటోరియల్ సర్కిళ్లలో చాలామంది సీఈలు అసలు సమావేశాలే నిర్వహించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలోని ఏఈఈ, జేఈఈలను ప్రభుత్వం చాలా చోట్ల గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమించడంతో కొనసాగుతున్న పనులపైనా పర్యవేక్షణ కొరవడింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన మొత్తం పనులు 1254
పురోగతిలో ఉన్నవి 505 (40.27శాతం)
కేటాయించిన మొత్తం నిధులు రూ. 305.42 కోట్లు
ఇప్పటికీ ప్రారంభం కాని పనులు 353 (28.14శాతం)
పూర్తయిన పనులు 396 (31.57శాతం)
ఇప్పటివరకు బీఆర్వో ఇచ్చింది రూ. 174 కోట్లు
విడుదల చేసింది రూ.12 కోట్లు