ఒంటిపై ఖాకీడ్రెస్ వేసుకోవాలని, సమాజంలో శాంతిభద్రతలు రక్షించాలని తెలంగాణ నుంచి సుమారు 2 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇంటి దగ్గర కష్టం చేసుకొని బతికే తల్లిదండ్రులు పంపే డబ్బులతో వేలకు వేలు ఫీజులు చెల్లించి మరీ ఇరుకు గదుల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రతి ఉదయం, సాయంత్రం గ్రౌండ్‌లల్లో చెమటోడ్చుతున్నారు. ఇలా ఏండ్ల తరబడి సిద్ధపడుతున్నా.. కోచింగ్ సెంటర్లకు లక్షలు ధారపోస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాకపోవడంతో వారి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. నిరుద్యోగ యువతంతా రోడ్లెక్కిమరీ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీసుశాఖలో సుమారు 17వేలకుపైగా ఖాళీలు ఉన్నట్టు గుర్తించినా.. రెండేండ్ల నుంచి పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. నిరుద్యోగుల విషయంలో కూడా రాజకీయంగా ఎత్తుగడలు వేస్తూ.. మీనమేషాలు లెక్కిస్తున్నది. 2022 ఏప్రిల్‌లో కేసీఆర్ ఇచ్చిన 16వేలకు పైగా పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మినహా.. నేటికీ ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ రాలేదని నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నాడు ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించిన ఉద్యోగాలను 2023 చివర్లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తమ ఖాతాలో వేసుకున్నదని నిరుద్యోగులే మండిపడుతున్నారు. మొత్తం 13వేలకు పైగా కానిస్టేబుల్ కొలువులు కేసీఆర్ ఇస్తే.. వాటిని తానే ఇప్పించినట్టు రేవంత్ చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏటేటా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుండటంతో.. తమ వయసు పెరిగిపోతున్నదని, ఫిజికల్ ఈవెంట్లకు శక్తి సరిపోవడం లేదని, మానసికంగా కుంగిపోతున్నామని లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం ఎంతో గొప్పగా అసెంబ్లీ సాక్షిగా 2024 ఆగస్టులో ప్రకటించిన జాబ్ క్యాలెండర్.. జాబ్‌లెస్ క్యాలెండర్గానే మిగిలిపోయింది. 2025 ఏప్రిల్ నాటికి కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని ఆ జాబ్ క్యాలెండర్లో ప్రకటించారు. అయినా.. ఆ గడువు ముగిసిపోయినా ఒక్క పోలీసు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక 2024 జనవరి 31న కేసీఆర్ ఇచ్చిన పోలీసు ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి 15వేల పోలీస్ ఉద్యోగాలిస్తామని ప్రగల్భాలు పలికారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన 13,444 మందికి నియామక పత్రాలు అందించి.. చేతులు దులుపుకున్నారని నిరుద్యోగులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఆయన చెప్పిన పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ల రాకపోగా.. కోచింగ్ సెంటర్లకు డబ్బులు ధారపోసి తమ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగులపై చిత్తశుద్ధి లేదని అంటున్నారు.
కాంగ్రెస్ నేతలు నాడు గొప్పలు చెప్పి.. ఇప్పుడు నోటిఫికేషన్ల ఊసు ఎత్తకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ నేతలను, ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వారిని నిరుద్యోగులు సంప్రదిస్తే.. ‘త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది.. మీరంతా శ్రద్ధగా చదువుకోండి. ఫిజికల్ ఈవెంట్లకు ప్రిపేర్ అవ్వండి’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారే తప్పా.. ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తారో చెప్పడం లేదని అంటున్నారు. రెండేండ్లుగా ‘త్వరలోనే’ అనే పదంతోనే సరిపుచ్చుతున్నారని.. ఈ పదం కూడా గిన్నీస్ రికార్డులకు ఎక్కించాలని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేస్తున్నారు. 2025 చివర్లోనైనా నోటిఫికేషన్ వస్తుందేమోనని ఆశపడి భంగపడ్డారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా.. మళ్లీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. దీంతో ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఎన్నికలకు ముందే పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఇక తమ సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో గడిచిన రెండేండ్లు, వచ్చే ఏడాది మొదలుకొని సుమారు 17వేల మందికిపైగా రిటైర్డ్ అవుతున్నారని లెక్కలు వేశారు. ఈ క్రమంలో సుమారు 14వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇప్పటికే ఇవ్వాల్సి ఉన్నా.. ఆ పని చేయడం లేదు. వాటిని భర్తీ చేయాలంటే కచ్చితంగా ఆర్థికశాఖ ఆమోదం ఉండాల్సిందే. మరోవైపు సిబ్బంది కొరత ఉన్నా.. భర్తీ చేయాల్సిన పోస్టులు వేలల్లో ఉన్నా.. ఆర్థికశాఖ నుంచి అనుమతి రావడం లేదు. కారణం ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్న రాజకీయాలేనని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు నేరాల నియంత్రణ తగ్గకపోగా.. మహిళల భద్రత గాలిలో దీపంలా ఉన్నది. ఇప్పటికే శాంతిభద్రతలు అదుపుతప్పి.. నడిరోడ్లపై హత్యలు జరుగుతున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో పోలీస్ బలగాలను మరింత బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం.. నోటిఫికేషన్ ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. మరోవైపు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిలో అధిక పనిభారానికి తోడు.. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతుండటంతో అకారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం రావడంలేదని అంటున్నారు.