హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్‌ను (Sanath Nagar TIMS) డిసెంబర్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అధికారులు అక్టోబర్ చివరి నాటికి భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి. హాస్పిటల్ ప్రారంభమైనప్పటి నుంచే ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించాలి అని సెప్టెంబర్ 19న వైద్యారోగ్యశాఖ సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్‌ను (TIMS) డిసెంబర్ 9న ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ మూడో వారంలోనే పనులన్నీ పూర్తి చేసి, వైద్యారోగ్యశాఖకు టిమ్స్ భవనాన్ని అప్పగించాలి అని అక్టోబర్ 23న సనత్‌నగర్ టిమ్స్ పనుల పరిశీలన సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ అధికారులకు చెప్పారు. కానీ డిసెంబర్ 9 వచ్చినా టిమ్స్ ప్రారంభోత్సవం ఊసులేదు.
బీఆర్ఎస్ సదాశయం.. కాంగ్రెస్ నిర్లక్ష్యం
బీఆర్ఎస్ హయాంలో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే సదాశయంతో అప్పటి సీఎం కేసీఆర్ హైదరాబాద్ చుట్టూ ఎల్బీనగర్, అల్వాల్, సనత్‌నగర్ టిమ్స్‌లకు శంకుస్థాపన చేశారు. 2022 ఏప్రిల్ 26న ఒకే రోజూ మూడు మల్టీ స్పెషాలిటీ టిమ్స్ దవాఖానల పనులు ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేసీఆర్ పాలనలో మొదలైన ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ఉద్దేశపూర్వకంగానే అలసత్వం వహిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కొత్తపేట(ఎల్బీనగర్) టిమ్స్‌ను మాజీమంత్రి హరీశ్‌రావు సందర్శించారు. పనుల్లో జాప్యం జరుగుతున్నదని మండిపడ్డారు. దీంతో మరుసటిరోజు మంత్రులు సమావేశమై టిమ్స్‌ను త్వరలోనే ప్రారంభిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి నెలకొన్నది.
సనత్‌నగర్ టిమ్స్‌కు మరో గడువు!
కాంగ్రెస్ సర్కారు సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభోత్సవానికి డేట్లు, డెడ్లైన్లు మారుస్తున్నా ఫలితం కనిపించడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నగరం నడిమధ్యన టిమ్స్ అందుబాటులోకి వస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని చెప్తున్నారు. ఈ దవాఖాన నిర్మాణంపై ప్రభుత్వం చొరవ చూపకపోవడం సరికాదని మండిపడుతున్నారు. సనత్‌నగర్ టిమ్స్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. సనత్‌నగర్ టిమ్స్ నిర్మాణ పనుల పురోగతిపై నోడల్ అధికారి మహబూబ్‌ఖాన్‌ను వివరణ కోరగా.. గ్లోబల్ సమ్మిట్ పూర్తయ్యాక దవాఖాన ప్రారంభోత్సవంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. దాదాపు అన్ని పరికరాలు వచ్చాయని తెలిపారు.