సారంగాపూర్, ఏప్రిల్ 4: ప్రభుత్వమేమో అందరికీ రుణమాఫీ చేసినమని చెప్తున్నది. మాకేమో ఇంకా మాఫీ కాలే.. మాకెప్పుడు రుణమాఫీ అయితదని రైతులు అధికారులను నిలదీశారు. నిజామాబాద్ జిల్లా సారంగపూర్ మండలం గుండారంలో చైర్మన్ శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సొసైటీ మహా జనసభకు తహసీల్దార్ అనిరుధ్, గిర్ధావర్ హరీశ్‌రెడ్డి, వైస్ చైర్మన్ సత్యంరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రుణమాఫీ ఏమైందని పలువురు రైతులు ప్రశ్నించారు.
‘రుణమాఫీ అందరికీ వస్తుందని చెబుతుండ్రు. అడిగినప్పుడల్లా అప్పుడు ఇప్పు డు అంటూ కాలం గడుపుతుండ్రు. ఇది మీకు న్యాయమేనా’ అని అధికారులను నిలదీశారు. ఒకరికి వస్తది.. మరొకరికి రాదా.. ఇదేం పద్ధతి అని నిట్టూర్చారు. ఇంకా కొంత మందికి రుణమాఫీ వచ్చేది ఉందని, మీకు కూడా అప్పుడే వస్తదని సొసైటీ సిబ్బంది సర్దిచెప్పేందుకు యత్నించారు. చేసేదేమీ లేక రైతులు మిన్నకుండి పోయారు.