నల్లని రోడ్డు.. దానిపై తెల్లని గీతలు.. కనుచూపు మేర ఒకేలా కనిపిస్తున్నాయి.. వీటికి రాష్ట్ర రహదారులు అని పేరు ఇది రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారు పనితీరు!
పెచ్చుల రోడ్డు.. దానిపై బోలెడు నెర్రెలు.. ఎటుచూసినా గోతులే కనిపిస్తున్నాయి.. వీటికి జాతీయ రహదారులు అని పేరు ఇది కేంద్రంలోని మోదీ సర్కారు పనితీరు!!
–
వికారాబాద్ జిల్లా బుగ్గనుంచి సోమారం వెళ్లే రోడ్డు ఇది. ఈ జిల్లాలో రోడ్ల మరమ్మతులకే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లలో రూ.256 కోట్లకుపైగా మంజూరు చేసింది. ఆర్అండ్బీ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రూ.560 కోట్లకుపైగా విడుదల చేసింది. 31 వంతెనల నిర్మాణానికి రూ.130 కోట్లకు పైగా ఇచ్చింది. పీఆర్ రోడ్ల నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా మంజూరు చేసింది.
గుంతల మయమైన ఈ రోడ్డు కొడంగల్ నుంచి తాండూర్ మధ్య జాతీయ రహదారి 167 ఇది. వికారాబాద్ జిల్లా మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు బీజాపూర్ జాతీయ రహదారిని నాలుగు లేన్ల విస్తరణకు రెండేండ్ల కిందట ఉత్తర్వులిచ్చినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. మహబూబ్నగర్ నుంచి చించోలీ వరకు ఉన్న జాతీయ రహదారి 167 మంజూరైనా పనులు జరగడం లేదు.
వరంగల్ నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాల వరకు నిర్మించాల్సిన జాతీయ రహదారి-563 నాలుగు లేన్ల విస్తరణ పనులకు 2022 మార్చి 8న రూ. 2,146.86 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాదే టెండర్లు కూడా పూర్తయ్యాయి. మూడేండ్లలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఒప్పందంలో ఉన్నది. అయితే, అగ్రిమెంట్ జరిగి ఏడాదైనా పనులు ప్రారంభించలేదు.
సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్డు ఇది. ఈ జిల్లాలో రోడ్లు, భవనాలశాఖ నేతృత్వంలో 94 పనులను 486 కిలోమీటర్ల మేర చేపట్టడానికి రూ.882 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇప్పటి వరకు 287 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.287 కోట్లు వెచ్చించింది.
సిద్దిపేట జిల్లా దుద్దెడ జంక్షన్ నుంచి చేర్యాల మీదుగా జనగామకు వెళ్లే 365బీ జాతీయ రహదారి దుస్థితి. సిద్దిపేట- జనగామ రహదారి (ఎన్హెచ్ 365బీ) అంటేనే ఓ సాహసయాత్ర. 46 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణను కేంద్రం పట్టించుకోవటం లేదు. రూ.423 కోట్లతో చేపట్టిన ఈ పనులు ప్రారంభించి 4 నెలలు గడుస్తున్నా పనుల్లో పురోగతి లేదు.
వరంగల్ జిల్లా నల్లబెల్లికి వెళ్లే ప్రధాన రహదారి ఇది. నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం నుంచి దుగ్గొండి మీదుగా వరంగల్ రోడ్డును గిర్నిబావి వద్ద కలుపుతూ డబుల్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. డబుల్ రోడ్డుతో ఇక్కడి పల్లెలు కళకళలాడుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది.
వరంగల్ జిల్లా ఖానాపురంలో అధ్వానంగా ఉన్న ఎన్హెచ్ 365 రోడ్డు ఇది. వరంగల్ జిల్లాలో ఉన్న జాతీయ రహదారి 365 అధ్వానంగా తయారైంది. ఖానాపురం మండలంలోని మంగళవారిపేట నుంచి మహబూబాబాద్ జిల్లా కంబాలపెల్లి వరకు 33 కిలోమీటర్ల రోడ్డు పనులు చాలా చోట్ల అసంపూర్తిగానే ఉన్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జాతీయ రహదారి 353సీకు సంబంధించి భూపాలపల్లి నుంచి చెల్పూర్ రహదారి మరమ్మతులకు 2022 మే 5న రూ.54 కోట్లకు టెండర్ ఖరారైంది. దీని పనులు ఏడాదిలో పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
గత పాలకులు గిరిజనుల బాధలు పట్టించుకునేవాళ్లు కాదు. వర్షకాలం వస్తే చాలు నానాతంటాలు పడేటోళ్లం. మాకు ఎలాంటి అవసరం వచ్చినా మహదేవపూర్ మండలానికి ఎళ్లేటోళ్లం. వర్షాలు పడితే సర్వాయిపేట వాగు, తీగలవాగు, పంకెన వాగు, బండలవాగు, పెద్దంపేట వాగులు నిండుగా పారేటివి. తప్పని పరిస్థితుల్లో వాగులు దాటుతున్న క్రమంలో అందులో పడి చనిపోయేటోళ్లు. దశాబ్దాలుగా పడుతున్న గోసను తెలంగాణ ప్రభుత్వం తీర్చింది. భారీగా వంతెనలను నిర్మించింది. మా గోస తీర్చిన కేసీఆర్కు రుణపడి ఉంటం.
– జీడి సారయ్య, దమ్మూరు (పలిమెల), జయశంకర్ భూపాలపల్లి జిల్లా