హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జర్నలిస్టులకు నూతన అక్రెడిటేషన్లు జారీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని, ఈ విషయంలో మీడియా అకాడమీ సైతం బాధ్యతలు మరిచి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధానకార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తి అవుతున్నా.. ఇప్పటివరకు అక్రెడిటేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు, జీవో జారీ చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
అక్రెడిటేషన్ల జారీకి మార్గదర్శకాల రూపకల్పన పేరుతో కమిటీలు వేసుకుంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని, ఇలాగైతే మరో రెండేండ్లయినా కొత్త అక్రెడిటేషన్లు జారీ అవుతాయా? అన్న అనుమానం జర్నలిస్టుల్లో నెలకొందని తెలిపారు.
గత సర్కారు హయాంలో రాష్ట్రంలో దాదాపు 23 వేల అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం వాటి సంఖ్యను తగ్గించడానికి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నదన్న అనుమానం కలుగుతున్నదని అన్నారు. ఎంప్యానల్మెంట్, అప్‌గ్రెడేషన్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. ఈ రెండు అంశాలపై తక్షణమే సమాచార శాఖ మంత్రి, మీడియా అకాడమీ చైర్మన్, ఆ శాఖ కమిషనర్ స్పందించి కార్డుల జారీ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని వెంటనే వాటికి పరిష్కార చర్యలు చేపట్టకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.