ఎల్లారెడ్డి రూరల్/రామారెడ్డి/ కాసిపేట/మెదక్ రూరల్, డిసెంబర్ 14 : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులకు సమాన ఓట్లు పోలవ్వగా అధికారులు లక్కీ డ్రా తీశారు. మెదక్ మండలం చీపురుదుబ్బ తండా గ్రామపంచాయతీలో 377 ఓట్లు ఉండగా, 367 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీత, బీఆర్ఎస్ మద్దతుదారు భీమిలికి 182 చొప్పున సమాన ఓట్లు వచ్చాయి. దీంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీయగా కేతావత్ సునీతకు సర్పంచ్ పదవి దక్కింది.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబాడీతండా(కే) గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులు భూక్యా రాంచందర్, బోడ బలరాంకు 193 చొప్పున సమాన ఓట్ల రావడంతో లక్కీ డ్రా తీశారు. బోడ బలరాంకు అదృష్టం వరించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడివి లింగాల సర్పంచ్ స్థానానికి పీ మామయ్య, ఎం సంతోష్ పోటీ పడ్డారు. మొత్తం 966 ఓట్లు పోలవగా, ఇరువురికి 483 చొప్పున ఓట్లు రావడంతో డ్రా తీశారు. మంగలి సంతోష్‌కు అదృష్టం వరించడంతో విజేతగా ప్రకటించారు.
ఓడిపోయాను..డబ్బులు తిరిగిచ్చేయండి ; సిద్దిపేట జిల్లా వేలూర్‌లో వార్డు అభ్యర్థి డిమాండ్
వర్గల్, డిసెంబర్ 14: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూర్‌లో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో వార్డు నుంచి పోటీచేసి ఓడిన ఓ అభ్యర్థి తన డబ్బులు తిరిగివ్వాలని ఓటర్లను డిమాండ్ చేశా రు. గ్రామంలోని వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు పెట్టడంతో వైరల్ అయ్యింది. ఒక్కో ఓటర్‌కు బిర్యా నీ పొట్లం, నగదు పంపిణీ చేసినట్టు తెలిసింది. డబ్బులు తీసుకున్న వారి నుంచి తిరిగి వసూలు చేస్తున్నట్టు తెలియడంతో ఆదివారం గౌరారం పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.