MBBS Admissions | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్’ పరీక్ష భవిష్యత్తు ఏమిటో తెలియక లక్షలాది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యంలో కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందో, ప్రవేశాలు ఎప్పుడు పూర్తవుతాయో, తరగతులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది.
ఈ నెల 4న నీట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ముందుగా 1563 మంది విద్యార్థుల ర్యాంకులపై అనుమానాలతో మొదలై.. పేపర్ లీకేజీ వరకు చేరింది. దీంతో పరీక్షనే రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 549 మెడికల్ కాలేజీల్లో 78వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
కొత్తగా మరికొన్ని మెడికల్ కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉన్నది. ఈ ఏడాది 2,333,297 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా.. 13,16,268 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 77,849 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 60.8% మంది అంటే 47,371 మంది అర్హత సాధించారు. నీట్ భవితవ్యం ఏమిటో తెలియక ఇప్పుడు వీరంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
కౌన్సిలింగ్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో అభ్యర్థుల్లో కాస్త ఆశలు చిగురించాయి. అయితే.. తాజాగా ఈ వ్యవహారం పేపర్ లీకేజీగా మారడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కూడా స్పష్టమైన ప్రకటన విడుదల చేయడం లేదు. అనుమానం ఉన్న 1563 మందికి త్వరలో పరీక్ష నిర్వహించనున్నారు.
వారి ఫలితాలు వచ్చి, ఆ తర్వాత కౌన్సిలింగ్ చేపట్టినా తరగతులు ప్రారంభం అయ్యేనాటికి కనీసం రెండు నెలలు పడుతుందని విద్యార్థులు చెప్తున్నారు. ఒకవేళ నీట్ పరీక్షను రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించాల్సి వస్తే మాత్రం నవంబర్, డిసెంబర్‌కు కూడా తేలకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ఎదురుచూడాలో లేదా ఇతర కోర్సుల్లో చేరిపోవాలో తెలియక మథనడపతున్నారు.
2020 నాటి పరిస్థితులేనా?
2020లోనూ ఎంబీబీఎస్ విద్యార్థులు ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నారు. ఆ ఏడాది కరోనా నేపథ్యంలో నీట్ పరీక్ష చాలా ఆలస్యంగా జరిగింది. సాధారణంగా మే నెలలో జరగాల్సిన పరీక్ష.. 2020లో ఏకంగా సెప్టెంబర్‌లో జరిగింది. అయితే నీట్ నిర్వహణపై అప్పటికే చాలా మంది విద్యార్థులు విద్యా సంవత్సరం వృథా కావొద్దనే ఉద్దేశంతో ఇతర డిగ్రీ కోర్సుల్లో, ఇతర యూనివర్సిటీల్లో చేరిపోయారు.
నీట్ ఫలితాల అనంతరం కొందరు ఫీజులు, జరిమానాలు చెల్లించి తమ సర్టిఫికెట్లు వెనక్కి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఏడాది దాదాపు ఐదు నెలలు ఆలస్యంగా డిసెంబర్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ 5 నెలలను తిరిగి సరిచేయడానికి నాలుగేండ్ల సమయం పట్టింది. ఈ సారి కూడా ఇలాంటి పరిస్థితులే పునరావృతమయ్యే అవకాశం ఉన్నదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త కాలేజీల మాటేమిటి?
ప్రస్తుతం రాష్ట్రంలో 56 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 3,915, ప్రైవేటు కాలేజీల్లో 4,600 కలిపి మొత్తం 8,515 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నా యి. ప్రస్తుతం రాష్ట్రంలో మరో 10 కాలేజీల అనుమతులు ఎన్ఎంసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇందు లో 8 ప్రభుత్వ కాలేజీలు. వీటిపై ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. వీటికి అనుమతులు వస్తే మరో 500 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కోటా 15శాతం, ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అటు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వక.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.