అధికారులు 160 మందికిపైగా ఉన్న జర్నలిస్టులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేశారు. ఆ గ్రూప్లో ఉన్నవారికే మేడారం వెళ్లి, అక్కడ క్యాబినెట్ భేటీ వార్తలు కవర్చేయడం, మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకునే ఏర్పాట్లుచేశారు. ఆ గ్రూప్లో ఉన్నవారి పేర్లతోనే రహస్యంగా లిస్టు తయారుచేసి, వారికే ట్రాన్స్పోర్ట్ అవకాశం కల్పించారు.
మొన్నటి వరకు ఆ గ్రూప్లో సమాచారాన్నంతా పంచుకున్న అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏం ఆదేశాలు వచ్చాయో తెలియదు కానీ.. శనివారం ‘నమస్తే తెలంగాణ, టీన్యూస్, తెలంగాణ టుడే ప్రతినిధులను ‘రిమూవ్’ చేశారు. అనంతరం తమ ప్రణాళికలో భాగంగా 100 మందికిపైగా జర్నలిస్టులను మేడారానికి తీసుకెళ్లి తమకు నచ్చినట్టు వార్తల కవరేజ్ ఇప్పించుకున్నారు.
ములుగు జిల్లా మేడారంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశ వార్తల కవరేజీకి సీఎంవో కనుసన్నల్లోని ఐఅండ్పీఆర్ నుంచి పంపిన లిస్టులోని జర్నలిస్టులను మాత్రమే పంపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ పబ్లికేషన్స్ మీడియా సంస్థల ప్రతినిధులను అనుమతించకపోయినా.. వరంగల్, ములుగు కేంద్రాలుగా పనిచేస్తున్న నమస్తే తెలంగాణ, టీన్యూస్, తెలంగాణ టుడే ప్రతినిధులను ఆహ్వానిస్తారని ఆశించినా.. వారికీ అనుమతి నిరాకరించారు.
క్యాబినెట్ భేటీ వార్తల కవరేజీ కోసం అక్కడికి వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది. కేవలం హైదరాబాద్ నుంచి వెళ్లిన వారికే స్థానిక హరిత హోటల్లో బస ఏర్పాటుచేసి వార్తల కవరేజీ, అమ్మల దర్శనం కల్పించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకే ఉద్దేశపూర్వకంగా నమస్తే తెలంగాణ, టీన్యూస్, తెలంగాణ టుడే ప్రతినిధులను తొలగించినట్టు తెలిసింది. ఈ ప్రక్రియలో కూడా ఇద్దరు మంత్రుల ప్రమేయం ఉన్నట్టు సమాచారం. యూట్యూబ్, వెబ్సైట్, డిజిటల్ పత్రికల పేరుతో వారికి అనుకూలంగా రాసేవారినే తీసుకెళ్లి ప్రజలపక్షాన ప్రశ్నిస్తున్న వారిని గ్రూప్ నుంచి తొలగించడంపై పలువురు జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.