హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రైతులకు మేలు చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలతో కేంద్రంలో రైతు ప్రభుత్వం రానున్నదని బీసీ సంక్షేమ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఢిల్లీకి బయలు దేరిన ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఉచిత కరెంటుతో పాటు రైతు బంధు, బీమా పథకాలు అందించాలన్నదే కేసీఆర్ ధ్యేయమని అన్నారు.
భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎనిమిది ఏండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన కేసీఆర్ బుధవారం ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని వివరించారు. ఈ కార్యక్రమానికి పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు హాజరు కానున్నారని వెల్లడించారు.