భూపాలపల్లి: బీజీపీ సంగ్రామ యాత్రపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఫైరయ్యారు. రాష్ట్ర బీజేపీ నేతలు యాత్రలు చేయాల్సింది ఢిల్లీలో అని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి పోరాటం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిథులతో కలిసిన భూపాలపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు పసలేని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. విపక్ష నాయకులు రాజకీయ ఉనికి కోసమే యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను మోదీ సంగ్రామ యాత్రగా మార్చుకోవాలన్నారు. బండి సంజయ్ యాత్ర అర్థ రహితమన్నారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చాడని గండ్ర నిలదీశారు.
న్యూతన వ్యవసాయ, విద్యుత్తు చట్టాలను తీసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతులను మోసగించిందన్నారు. కార్పొరేట్ శక్తుల మేలుకోసమే నూతన వ్యవసాయ చట్టాలు చేశారని, హర్యానాలో ఆందోళన చేస్తున్న రైతుల తలలు పగలగొట్టిన ఘనమైన చరిత్ర బీజేపీ ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. విద్యుత్ సంస్కరణలతో రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తున్నారని, నిర్లక్ష్యపు నియంతృత్వ బీజేపీ పాలన బ్రిటిష్ పాలన తలపిస్తున్నదని ఆయన మండిపడ్డారు.
విభజన చట్టం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ములుగు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ, ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఏం సాధించారని బండి సంజయ్ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా బడా వ్యాపారులకు కట్టబెట్టేందుకు ప్రధాని మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు.
తిడితేనే ప్రజల మెప్పు పొందుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, అది ఆయన రాజకీయ వివేకానికి నిదర్శనమని వెల్లడించారు. విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ అవివేకిగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు వీరి దుష్ప్రచారాన్ని తిప్పికొడతారని హెచ్చరించారు.