RTI Commission | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): సమాచార కమిషనర్ల నియామకంలో కాంగ్రెస్ సర్కారు సామాజిక న్యాయం పాటించలేదని, బీసీలకు అన్యాయం చేసిందని సామాజిక, రాజకీయవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్, ఐదుగురు కమిషనర్ల నియామకాలను ప్రభుత్వం పూర్తిచేసింది. మరో రెండు కమిషనర్ పోస్టులను పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికే పూర్తయిన ఐదుగురు కమిషనర్ల నియామకాల్లో బీసీల నుంచి ప్రాతినిధ్యం లేదు. ఇక పెండింగ్‌లో ఉన్న రెండు నియామకాల్లోనూ బీసీలకు అవకాశం కల్పించడంపై సామాజిక కార్యకర్తలు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్, ఏడుగురు కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం రెండు నెలల క్రితం కసరత్తు చేపట్టింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్ట్‌కు సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన చంద్రశేఖర్‌రెడ్డి పేరును, కమిషనర్ పదవులకు పీవీ శ్రీనివాస్‌రావు(బ్రాహ్మణ), బోరెడ్డి అయోధ్యరెడ్డి(రెడ్డి), కప్పర హరిప్రసాద్(బీసీ), పీఎల్ఎన్ ప్రసాద్(బీసీ), రాములు(ఎస్సీ), వైష్ణవి మేర్ల(కమ్మ), పర్వీన్ మొహిసిన్ (ముస్లిం మైనార్టీ) పేర్లను ఏప్రిల్ 26న గవర్నర్ ఆమోదానికి పంపింది. వీరిలో కప్పర ప్రసాద్, పీఎల్ఎన్ ప్రసాద్, రాములు మినహా మిగిలిన నలుగురి ప్రతిపాదనలకు గవర్నర్ పచ్చజెండా ఊపారు.
కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నందు వల్లే ఈ ముగ్గురి పేర్లు ఆమోదం పొందలేదని, సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాములు(ఎస్సీ) స్థానంలో దేశాయ్ భూపాల్ (ఎస్సీ) పేరును గవర్నర్‌కు పంపించగా ఆమోదం లభించింది. కానీ ఆమోదం పొందని బీసీ అభ్యర్థులు కప్పర హరిప్రసాద్, పీఎల్ఎన్ ప్రసాద్ స్థానంలో మాత్రం ప్రత్యామ్నాయ పేర్లను ప్రతిపాదించలేదని తెలుస్తున్నది. అందుకే ఆ రెండు పోస్టులు ఖాళీగా ఉంచి, మిగిలిన ఐదు పోస్టులకు మాత్రమే ప్రభుత్వం నియామకం, ప్రమాణ స్వీకార ప్రక్రియను పూర్తి చేసిందని సమాచారం.
ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్ల నియామకప్రక్రియకు సంబంధించి జీవో జారీ చేసింది. ఈ జీవోలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, కమిషనర్ల పేర్లు, వారి సామాజికవర్గాల వివరాలను పేర్కొంది. కానీ వైష్ణవి మేర్ల పేరు పక్కన మాత్రం తన సామాజికవర్గమైన కమ్మ అని పేర్కొనలేదు. అందరి సామాజికవర్గాలను ప్రస్తావించి, వైష్ణవి వర్గంలో మాత్రం గోప్యత ఎందుకు పాటించినట్టు అనే సందేహాలు సామాజిక, రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఆంతర్యమేంటని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వ్యవస్థాపకుడు రాజేంద్ర పల్నాటి ప్రశ్నించారు. ప్రభుత్వం గవర్నర్‌ను తప్పుదోవ పట్టించి అర్హతలేని వారికి పదవులు కట్టబెట్టిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
రేవంత్ సర్కారు వైఖరిపై బీసీ సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఐ కమిషనర్ల నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ పలువురు మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ చెప్పే సామాజికన్యాయం ప్రకారం ఏడుగురు కమిషనర్ల పోస్టుల్లో మూడు పోస్టులు బీసీలకు ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ఆర్టీఐ కమిషనర్లుగా రాజకీయ నేపథ్యమున్న వారి అభ్యర్థిత్వం ఆమోదం పొందదని తెలిసీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బీసీ, ఎస్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నాయకుల పేర్లు పంపించిందని వారు ఆరోపిస్తున్నారు. బీసీలకు మొండిచేయి చూపడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అసలు నైజం బయటపెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. పదవుల్లో అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నారు.