కుండపోత వర్షాలతో తెలంగాణలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఈ క్రమంలో ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తూనే ఉన్నారు. నదులకు, ప్రాజెక్టులకు వరద పోటెత్తినప్పుడల్లా టీఎంసీ, క్యూసెక్కు అనే పదాలు వాడుతూనే ఉంటాయి. ఈ మాటలు వానాకాలంలో తరుచుగా వింటూనే ఉంటాం. నీటి నిల్వ గురించి మాట్లాడినప్పుడు టీఎంసీలలో, నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో గురించి మాట్లాడితే క్యూసెక్కులలో చెప్పాలి. మరి టీఎంసీ, క్యూసెక్కుల అర్థం ఏంటో తెలుసుకుందాం..
టీఎంసీ (TMC) : ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటి పరిమాణం చెప్పడానికి ఉపయోగించే ప్రమాణం – టీఎంసీ. TMC అంటే THOUSAND MILLION CUBIC FEET అని అర్థం. శతకోటి ఘనపుటడుగులు అని అర్థం. ఒక టీఎంసీ అంటే 2,80,00,000 క్యూబిక్ మీటర్లు.
క్యూసెక్కు (CUSEC) : క్యూసెక్కు అంటే సెకను కాలంలో ప్రవహించే ఘనపుటడుగుల నీరు అని అర్థం. CUBIC FEET PER SECOND అని అర్థం. ఒక సెకను వ్యవధిలో ఘనపుటడుగుల నుంచి ప్రవహించే నీరు 28 లీటర్లు. ఏదైనా ఒక రిజర్వాయరు నుంచి కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీరు 24 గంటల పాటు ప్రవహిస్తే ఒక టీఎంసీ నీరు వెళ్లిపోతోంది.