హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): ‘అధికారంలోకి వచ్చిన తక్షణమే పంటల బీమా పథకాన్ని (Crop Insurance) అమలు చేస్తాం. వివిధ కారణాలతో పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందిస్తాం’ ఇదీ కాంగ్రెస్ (Congress) పార్టీ ఎన్నికల సమయంలో, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ. కానీ అధికారంలోకి వచ్చి రెండేండ్ల్లు కావస్తున్నా ఇప్పటివరకు పంటల బీమా పథకాన్ని అమలే చేయలేదు. రైతులను మభ్యపెట్టేందుకు మొదట్లో కొంత హడావుడి చేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అసలు ఆ ఫైలునే అటకెక్కించేసింది. రైతుల కష్టాన్ని అకాల వర్షాలు మింగేస్తుండగా, ఆదుకోవాల్సిన ప్రభుత్వం ‘చేయి’చ్చింది.
ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమైంది. కనీసం పంటల బీమా ఉంటే కొంత ఆసరా ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పడంతో కన్నీళ్లే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకంలో ఇష్టమైన రైతులే ప్రీమియం చెల్లించి పథకంలో చేరేవారు. వారికి ఇష్టమైన పంటకే బీమా చేయించుకునేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో పంటల బీమా అమలుపై సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు, ప్రతి పంటకు బీమా అమలు చేస్తామని ప్రకటించారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. అంటే సుమారు 70 లక్షల మంది రైతులకు, 136 లక్షల ఎకరాల్లో సాగయ్యే పంటలకు బీమా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రకటన తప్ప అడుగు ముం దుకు పడలేదు.
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం పంటల బీమా అమలు చేయడంలేదని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ విమర్శించింది. అదే పార్టీ అధికారంలోకి రావడంతో పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేస్తారని అంతా భావించారు. కానీ రెండేండ్లు గడుస్తున్నా ఆ పథకం అమలు ఊసే ఎత్తడం లేదు. పంటల బీమా పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డే అడ్డుకున్నారనే చర్చ వ్యవసాయశాఖలో జరుగుతున్నది. నిరుడు వానకాలం సీజన్ నుంచి పథకాన్ని అమలు చేస్తామని స్వయంగా మంత్రి తుమ్మల ప్రకటించారు. ఈ మేరకు బీమా ఇన్సూరెన్స్ కంపెనీలతో వ్యవసాయ శాఖ చర్చలు జరిపింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్‌బీమా పథకంలో చేరేందుకు కేంద్ర అధికారులతోనూ చర్చలు జరిపింది. టెండర్ల దశకు వచ్చింది. ఇందుకు సంబంధించి అనుమతి కోసం ఫైల్‌ను సీఎం కార్యాలయానికి పంపింది. సీఎంవోకు చేరిన ఫైలును అక్కడే పక్కన పడేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పథకం అవసరంలేదని, అమలుకు నిధులు కూడా లేవంటూ ఫైల్‌ను తిరస్కరించినట్టు చర్చ జరుగుతున్నది. ఈ అంశంలో సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి మధ్య అభిప్రాయభేదాలు కూడా ఏర్పడినట్టు ప్రచారం జరుగుతున్నది.
పంటల బీమా అమలుకు ఏటా సుమారు రూ.3 వేల కోట్లు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రభుత్వం తన వాటా కింద చెల్లించేది సుమారు రూ.1,800 కోట్లు కాగా, రైతుల వాటా కింద రూ.1,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని లెక్కలేసింది. అంత భారీ మొత్తం సమకూర్చడం ఇబ్బంది అవుతుందని సీఎంవో తేల్చిచెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే పథకం ప్రారంభాన్ని నిలిపేసినట్టు సమాచారం. ఒకవేళ పథకాన్ని అమలుచేస్తే ప్రభుత్వం ఎలాగూ తన వాటా కింద రూ.1,800 కోట్లు చెల్లించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. అదనంగా భారం పడేది రూ.1,200 కోట్లు అని, లక్షలాది మంది కోసం ఆమాత్రం ఖర్చు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదా? అని విమర్శిస్తున్నారు.
గడిచిన రెండేండ్లలో జరిగిన అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా రైతులు సుమారు రూ.8వేల కోట్లు నష్టపోయినట్లు అంచనాలున్నాయి. లెక్కల ప్రకారమే సుమారు 25-30 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 2024 సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని అంచనా. వ్యవసాయ శాఖ మాత్రం అధికారికంగా 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్టు వెల్లడించింది. 2024 మార్చిలో కురిసిన వర్షాలకు 15,814 ఎకరాల్లో, అదే ఏడాది ఏప్రిల్‌లో 3,120 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని వ్యవసాయశాఖ వెల్లడించింది. కానీ సుమారు 50 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్టు అంచనాలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వడంగడ్ల వర్షాలకు 51,528 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆ శాఖ తేల్చింది.
కానీ 2 లక్షల ఎకరాలుగా అంచనాలున్నాయి. గత సెప్టెంబర్‌లో కామారెడ్డి, నిజామాబాద్, అదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు సుమారు 5-7 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. కానీ దీన్ని చివరికి 2.36 లక్షల ఎకరాలకు కుదించింది. ఇటీవల మొంథా తుఫాను కారణంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్వయసాయ శాఖ అధికారికంగా తెలింది. వాస్తవానికి ఈ నష్టం సుమారు 7-8 లక్షల ఎకరాల్లో ఉంటుందని అంచనా.
ఎప్పుడు వర్షాలొచ్చినా, వరదలొచ్చినా, వడగండ్లొచ్చినా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామంటూ ప్రభుత్వం హామీ ఇస్తున్నది. కానీ ఇప్పటివరకు అమలు చేయడం లేదు. గడిచిన రెండేండ్లలో సుమారు 6-7 సార్లు అకాల వర్షాలతో పంట నష్టం జరగ్గా, ప్రభుత్వం కేవలం ఒక్కసారి మాత్రమే రూ.10 వేల చొప్పున సగం మంది రైతులకే చెల్లించింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన పంట నష్టానికి కూడా పరిహారం చెల్లించలేకపోయింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలతో 51,528 ఎకరాల్లో పంట నష్టం జరగ్గా మే 28న రూ.51.52 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ నేటికీ బాధిత రైతులకు ఒక్క రూపాయి అందలేదు. గత సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రకటించిన సర్కారు.. పరిహారం ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ఇవ్వనేలేదు. నిరుడు మార్చిలో 19 వేల ఎకరాల్లో పంటనష్టం జరగ్గా, ఇందులో సగం మందికే పరిహారం అందించి మిగతా వారికి ఎగవేసింది. 2024 సెప్టెంబర్‌లో కురిసన వర్షాలకు 4.15 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అంచనాలుండగా ఇప్పటివరకు ప్రభుత్వం పరిహారం కింద నయా పైసా రైతులకు చెల్లించలేదు.
పంట నష్టపరిహారంపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీకీ విలువలేకుండా పోతున్నది. వర్షాలు రాగానే సీఎం రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించడం, అక్కడి రైతులను పరామర్శించి ఆర్భాటంగా పరిహారం ప్ర కటించడం పరిపాటిగా మారింది. కానీ ఆ తర్వాత ఆ హామీ కార్యరూపం దాల్చడమే లే దు.. రైతులకు పరిహారం అందడమూ లేదు.