హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని కెమిక్ లైఫ్‌సైన్స్ పరిశ్రమ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రసాయన వ్యర్థాలను బహిరంగంగా వదిలివేస్తున్నారని, ఎన్విరాన్మెంట్ కాంపెన్సేషన్ చెల్లించలేదనే కారణాలతో స్థానిక ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. దీంతో పరిశ్రమపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చర్యలు చేపట్టింది. మార్గదర్శకాలను పాటించడంలేదనే కారణాలతో పరిశ్రమకు క్లోజర్ ఆర్డర్ జారీ చేస్తున్నట్టు వెబ్సైట్లో వెల్లడించింది. కానీ లెక్కచేయని పరిశ్రమను యథావిధిగా నిర్వహిస్తున్నది. యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కవడం వల్లే పరిశ్రమ యథేచ్ఛగా నడుస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కెమిక్ లైఫ్‌సైన్స్ పరిశ్రమలోని రసాయన వ్యర్థాలను 38 ట్యాంకర్ల ద్వారా వదిలివేశారని గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. పరిశ్రమను మూసివేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతు గుమ్మి దామోదర్‌రెడ్డి జనవరి 15న గ్రామస్థులతో కలిసి సీఎస్, సీఎంవో, పీసీబీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు.
ఖిలావరంగల్, జనవరి 30: తనను ఉగ్రవాదినని ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎండీ జక్రియా వరంగల్‌లోని మిల్స్‌కాలనీ పోలీసులకు గురువారం ఫిర్యాదుచేశారు. బిర్యానీ సెంటర్‌తో కుటుంబాన్ని పోషించుకుంటున్న తనపై మీడియా తప్పుడు ప్రచారం చేసి తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు.