Mulki Movement | ఇంతకీ ముల్కీ ఉద్యమం మొదలైంది ఎవరి వల్ల? ఉద్యమాన్ని అణచివేసింది ఎవరు? విద్యార్థులను బలి తీసుకున్నది ఎవరు? అన్ని ప్రశ్నలకూ సమాధానం.. కాంగ్రెస్!
గైర్ జిమ్మేదారీ.. కాంగ్రెస్ డీఎన్ఏ! తెలంగాణ ఇచ్చామని చెబుతున్న ఆ పార్టీ గైర్ జిమ్మేదారీ వల్లే.. ఉన్న తెలంగాణ ఉనికిని కోల్పోయింది. 1952లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రభుత్వం గైర్ జిమ్మేదారీతో.. ముల్కీ కానూన్ కాగితాల్లో మూలిగింది. హైదరాబాద్ రాష్ట్రమంతా నాన్ ముల్కీలకు నెలవైంది. వాదాలు చేసి, వాయిదాలు వేయడంతో ముల్కీ ఉద్యమం పురుడు పోసుకుంది. యావత్ హైదరాబాద్ స్టేట్ నెత్తురోడింది. ‘గైర్ ముల్కీ గో బ్యాక్’ అని నినదించిన మన బిడ్డలపై కాంగ్రెస్ కర్కశత్వం బందూక్లు పేల్చింది. 1952లో కాంగ్రెస్ చేసిన నెత్తుటి సంతకం సిటీ కాలేజీ గోడలపై నేటికీ పచ్చిగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ క్రూరత్వానికి, విద్యార్థుల అమరత్వానికి మదీనా చౌరస్తా ఓ చారిత్రక సాక్ష్యం.
తేది: 1952 సెప్టెంబర్ 3
సమయం: ఉదయం 10 గంటలు
ప్రదేశం: ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజీ, సైఫాబాద్, హైదరాబాద్
ముల్కీ ఉద్యమానికి మద్దతుగా విద్యార్థి ఊరేగింపు బయల్దేరింది. ‘గైర్ ముల్కీ గో బ్యాక్’ నినాదాలు నగరమంతా ప్రతిధ్వనించాయి. చల్లటి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అందరి సంకల్పం ఒకటే! కాంగ్రెస్ కుయుక్తులను కూకటివేళ్లు సహా పెకిలించివేయాలని! ప్రభుత్వ కార్యాలయాలను నాన్ ముల్కీల అడ్డాగా మార్చిన కాంగ్రెస్ కుటిలత్వాన్ని కడిగిపారేయాలని! పిడికిళ్లు బిగించిన యువత ఉద్వేగంగా కదులుతున్నది. ఒక్కో అడుగు.. కాంగ్రెస్ నేతల గుండెల్లో దడ పుట్టించింది. సమస్య పరిష్కారానికి చొరవ చూపని కాంగ్రెస్.. మన యువతపై కత్తిగట్టింది. పోలీసు బలగాలను రంగంలోకి దించింది. కాసేపటికే పోలీసు జీపులు అటుగా వచ్చాయి. ఖాకీలు విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేయలేదు. దౌర్జన్యానికి దిగారు. లాఠీలకు పని చెప్పారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. ఆ దెబ్బతో విద్యార్థి లోకం తోకముడుస్తుందని భావించారు వాళ్లు. కానీ, అసలు కథ అప్పుడే మొదలైంది..
విద్యార్థిలోకం నివురు గప్పిన నిప్పులా ఉందని భావించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. ‘జంట నగరాల్లో ఊరేగింపులు, సభలను నిషేధిస్తూ’ హుటాహుటిన ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులు ఇవేవీ పట్టించుకోలేదు. పోలీసుల నిషేధాజ్ఞలను ధిక్కరించి నగరం నలుమూలల నుంచి ఒక్కొక్కరుగా సిటీ కాలేజీ బాటపట్టారు. పదిమందయ్యారు, వంద దాటారు, వేలకు చేరారు. సిటీ కాలేజీ ప్రాంగణమంతా విద్యార్థులే. అందరూ నినాదాలు చేస్తూ ఒక్కసారిగా రోడ్డెక్కారు. ‘గైర్ ముల్కీ గో బ్యాక్..’ అని నినదిస్తూ, కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రశ్నిస్తూ కదంతొక్కారు. మహబూబ్ షాహీ రోడ్డులో ప్రదర్శన కొనసాగుతున్నది. పది నిమిషాలకే పోలీసు బలగాలు అక్కడికి వచ్చిపడ్డాయి. ఊరేగింపుపై టియర్‌గ్యాస్ ప్రయోగించారు. పిడుగుల్లా వచ్చిపడుతున్న బాష్పవాయు గోళాలను తప్పించుకుంటూ విద్యార్థులు చెల్లాచెదురయ్యారు. మళ్లీ క్షణాల్లో అందరూ ఒక్కటై సిటీ కాలేజీ ఆవరణలో రణానికి సిద్ధమయ్యారు.
అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు తు.చ. తప్పకుండా పాటించిన పోలీసులు విద్యార్థుల గొంతు నొక్కడమే లక్ష్యంగా సిటీ కాలేజీకి చేరుకున్నారు. నాలుగు దిక్కుల నుంచీ కాలేజీని చుట్టుముట్టారు. విద్యార్థులు భయపడలేదు. పోలీసుల చేతులు లాఠీలు పడితే.. విద్యార్థుల పిడికిళ్లు రాళ్లందుకున్నాయి. మళ్లీ బాష్పవాయు గోళాల ప్రయోగం జరిగింది. టియర్ గ్యాస్ షెల్స్ కాలేజీ ఆవరణలో ఇబ్బడిముబ్బడిగా పడసాగాయి. కొన్ని సిటీ కాలేజీని దాటి పక్కనే ఉన్న హైకోర్టులోనూ పడ్డాయి. కాలేజీ ప్రహరీని, తరగతి గదులను రక్షణ స్థావరాలుగా చేసుకున్న విద్యార్థులు.. పోలీసులను దీటుగా ఎదుర్కొన్నారు. కాస్త సద్దుమణిగిన తర్వాత.. మూకుమ్మడిగా మదీనా వైపు ఊరేగింపుగా బయల్దేరారు. ‘పోలీస్ జులుం నశించాలి.. కాంగ్రెస్ ముర్దాబాద్’ అని నినాదాలు చేస్తున్న విద్యార్థులపై మళ్లీ బాష్పవాయు గోళాల వర్షం కురిసింది. మళ్లీ సిటీకాలేజీని రక్షణగా చేసుకున్న విద్యార్థులు పోలీసులపై రాళ్లతో ప్రతిదాడికి దిగారు.
సిటీ కాలేజీకి సమీపంలో (పేట్లబుర్జు దగ్గర) నగర పోలీసు కమిషనరేట్ ఉండేది. అదే సమయంలో కొత్వాల్ శివకుమార్ లాల్ కారులో బయల్దేరాడు. ఆయన రాకను గమనించిన విద్యార్థులు యాభై మందికిపైగా ఒక్క ఉదుటన రోడ్డుపైకి వచ్చారు. పోలీసు కమిషనర్ కారుకు అడ్డం తిరిగారు. ఆయన్ను చుట్టుముట్టారు. విద్యార్థుల దాడికి కమిషనర్ యూనిఫాం చినిగింది. భుజాలపై ఉన్న బ్యాడ్జ్‌లు ఊడిపడ్డాయి. చేతిగడియారం, కళ్లజోడు పగిలిపోయినయి. మళ్లీ పోలీసులు విజృంభించడంతో విద్యార్థులు సిటీ కాలేజీలోకి చేరారు. తుఫాన్ ముందు ప్రశాంతతలా కాసేపు ఉద్రిక్త వాతావరణం చల్లబడింది.
మరోవైపు విద్యార్థులు వందలుగా సిటీకాలేజీకి చేరుకోసాగారు. వీరిని కట్టడి చేయడం సాధ్యం కాదని కాంగ్రెస్ నేతలకు అర్థమైంది. ఆ పార్టీ నేతలు ప్రాణేశాచారి, బాకర్ అలీ అక్కడికి చేరుకున్నరు. అక్రమంగా ఉద్యోగాలు పొందిన గైర్ ముల్కీలను తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా, ఉద్యమాన్ని విరమించాలని విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఎత్తులను పసిగట్టిన విద్యార్థులు ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ రంగప్రవేశం చేశారు. ఆయన ప్రయత్నాలూ ఫలించలేదు. నాన్ ముల్కీలపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలని, వారిని ప్రభుత్వ కొలువుల్లోంచి తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
సిటీ కాలేజీ ప్రాంగణం విద్యార్థులతో సముద్రంగా మారింది. ఉద్యమానికి మద్దతు పెరుగుతున్న తీరు కాంగ్రెస్‌లో గుబులు రేపింది. వేలాది మంది విద్యార్థులు ఊరేగింపుగా మదీనా వైపు కదిలారు. అప్పటికే సిటీ కాలేజీకి చేరుకుందామని వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరిన విద్యార్థులతో చార్మినార్, పత్తర్‌గట్టి పరిసరాలు కిక్కిరిసి పోయాయి. ఊరేగింపును అడ్డగించడాన్ని నిరసిస్తూ సమీపంలో ఏర్పాటుచేసిన పోలీసు ఔట్‌పోస్టుకు నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు. రెండు ఫైరింజన్లు రానేవచ్చాయి. మరోవైపు సిటీకాలేజీ నుంచి కదిలిన విద్యార్థి వాహినితో వీధులన్నీ నిండిపోయాయి. విద్యార్థుల నినాదాల్లో పోలీసుల హెచ్చరికలు కలిసిపోయాయి. ఖాకీల పద ఘట్టనలతో మదీనా ప్రాంతం భీతావహంగా మారిపోయింది. విద్యార్థి లోకం తగ్గకపోవడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది.
ప్రదేశం: మదీనా చౌరస్తా; సమయం: మధ్యాహ్నం 2 గంటలు
విద్యార్థి ప్రవాహాన్ని పోలీసులు మదీనా దగ్గర అడ్డగించారు. పోలీసు కమిషనర్ బషీర్ అహ్మద్ అక్కడే ఉన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్‌ను కాంగ్రెస్ నేతలు చెవికెక్కించుకోలేదు. నిరసన చేస్తున్నది మన బిడ్డలేనన్న సంగతీ విస్మరించారు. నగరం అట్టుడుకుతుంటే.. కాంగ్రెస్ చోద్యం చూసింది. ఫలితం మెజిస్ట్రేట్ కాల్పులకు ఆదేశాలిచ్చారు. రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. విద్యార్థులు వెరవలేదు. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో తూటాలను ఎదుర్కోవాలని సిద్ధమయ్యారు.
మరుక్షణంలో.. కాంగ్రెస్ పార్టీది ఎంతటి పాషాణ హృదయమో తేటతెల్లం చేస్తూ పోలీసుల తుపాకుల్లోంచి తూటాలు పేలాయి. విద్యార్థులపై బుల్లెట్ల వర్షం. విద్యార్థి మహ్మద్ ఖాసీం కుప్పకూలిపోయాడు. ‘బచ్చా మర్గ యా’ అన్న మాటలు దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించాయి. విద్యార్థులు, వారికి మద్దతుగా వచ్చిన ప్రజలు సిటీకాలేజీకి పరుగుతీశారు. నలభై నిమిషాల తర్వాత మళ్లీ ప్రదర్శన బయల్దేరింది. విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా విద్యావంతులు, రిక్షా కార్మికులు, రోజు కూలీలు, వ్యాపారులు, ఉపాధ్యాయు లు తరలివచ్చారు. మదీనా దగ్గరికి సుమారు 40వేల మంది చేరుకున్నారు. అడ్డగించిన పోలీసులపై రాళ్లు విసిరారు. బస్సులను అడ్డుకున్నా రు. ఖాకీలు లాఠీచార్జీ మొదలుపెట్టారు. ఎన్ని దెబ్బలు పడుతున్నా.. మాట మార్చలేదు విద్యార్థులు. ‘గైర్-ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ అంటూ గొంతుకను పెంచారే తప్ప.. వెనక్కి తగ్గలేదు.
ఎలాగైనా విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం. దానికి అనుగుణంగా మెజిస్ట్రేట్ మరోసారి కాల్పులకు ఆదేశాలు ఇచ్చారు. ఈసారి పేలిన తూటాలు విద్యార్థుల దేహాలను చీల్చుకుంటూ వెళ్లాయి. షేక్ మహబూబ్ వీపులో మూడు తూటాలు దిగాయి. అక్కడికక్కడే అతను చనిపోయాడు. అనేక మంది గాయపడ్డారు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నలభై ఏండ్ల జమాలుద్దీన్, పద్దెనిమిదేండ్ల రాములు ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్ స్టేట్ వాసుల ధర్మబద్ధమైన ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ పోరాటాన్ని రక్తసిక్తం చేసి.. విద్యార్థులను బలిగొన్న కాంగ్రెస్ తెలంగాణ చరిత్రలో మొదటి నెత్తుటి సంతకం చేసింది.
ఆనాటి విద్యార్థులందరూ సాయం త్రం ఫతేమైదాన్‌లో కలుసుకున్నారు. ‘అమరుల త్యాగం వృథా కానివ్వం. రేపు ఉదయం ఉస్మానియా దవాఖాన దగ్గర అమరుల శవాలతోని ఊరేగింపు తీస్తాం’అని శపథం చేశారు. మర్నాడు వేలమంది విద్యార్థులు ఉస్మానియా దవాఖాన దగ్గరికి చేరారు. ప్రభుత్వం మరోసారి తన కర్కశత్వాన్ని నిరూపించుకుంది. ‘శవాలను తెల్లవారుజామునే మీర్ ఆలం చెరువు దగ్గర ఖననం చేశామ’ని పోలీస్ కమిషనర్ చెప్పారు. ‘మృతదేహాలను కుటుంబసభ్యులకు ఇవ్వకుండా ఖననం చేసే అధికారం మీకెక్కడిద’ని ప్రజలు పోలీసులను ప్రశ్నించారు. పౌరహక్కుల నాయకులు డాక్టర్ జయసూర్య, పద్మజా నాయుడు ముఖ్యమంత్రిని నిలదీశారు. ‘బొందలు తవ్వి, శవాలు అప్పగిస్తామ’ని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. దయమాలిన కాంగ్రెస్ దురాగతానికి ఇదొక ఉదాహరణ. ప్రభుత్వ వైఖరితో ప్రజల్లో మరోసారి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోసారి తుపాకులు మోగాయి. 15 నిమిషాలపాటు జరిగిన ఫైరింగ్‌లో మరో నలుగురు బిడ్డలు ప్రాణాలొదిలారు.
ముల్కీ ఉద్యమ ఘటనలపై జస్టిస్ జగన్ మోహన్ రెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. ‘కాల్పుల్లో అమాయకులు చనిపోయినంత మాత్రాన చట్టబద్ధంగా జరిగిన కాల్పులను.. చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించలేం’ అని నివేదిక సమర్పించారు. మలిదశ ఉద్యమానికి ద్రోహం తలపెట్టేందుకు సలహాలు చెప్పిన శ్రీకృష్ణ కమిటీ లాగానే ఆనాటి జగన్మోహన్ రెడ్డి కమిటీ నివేదికా ఉన్నది.
వరంగల్‌లో మొదలైన ముల్కీ ఉద్యమం హైదరాబాద్‌లో రక్తమోడింది. ఈ పోరులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 38 మంది తుపాకీ గుళ్ల దెబ్బలు తిన్నరు. లాఠీల దెబ్బలకు 147 మంది గాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతికి హైదరాబాద్ స్టేట్ కుతకుత ఉడికిపోయింది. జనాగ్రహం పసిగట్టిన ప్రభుత్వం సెప్టెంబరు 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో కర్ఫ్యూ విధించింది. త్యాగాలతో ఎరుపెక్కిన ముల్కీ ఉద్యమం ఆ తర్వాత అణగారిపోయింది. కానీ, ఆనాటి విద్యార్థులు శపథం చేసినట్టు అమరుల త్యాగాలు వృథా కాలేదు. తెలంగాణ సాళ్లల్లో నాటుకున్న ఆనాటి త్యాగాల బీజాలు 1969లో స్వరాష్ట్ర ఆకాంక్షలై మొలకెత్తినయ్. లాఠీలకు వెనుదీయని ఓరుగల్లు బిడ్డల ముందడుగు, తూటాలకు వెరవని హైదరాబాద్ విద్యార్థి వీరుల త్యాగాలు ఈనాటి తెలంగాణకు బాటలుపరిచాయి.
సిటీకాలేజీ, చార్మినార్ పరిసరాల్లో లాఠీచార్జీ, కాల్పులకు విద్యార్థులు చెల్లాచెదురయ్యారు. అయినా ఇంటికి వెళ్లకుండా… నగర వీధుల్లో తిరగసాగారు. కొందరు అఫ్జల్‌గంజ్ నుంచి అబిడ్స్ వైపు కదిలారు. మొజంజాహి మార్కెట్ దగ్గర కాచుకొని ఉన్న పోలీసులు ఆ యువకులను లాఠీలతో చావబాదారు. పోలీసుల నుంచి తప్పించుకున్న కొందరు అబిడ్స్ నుంచి కోఠి వైపు పరిగెత్తారు. కోఠీలో ఓ సభలో ముఖ్యమంత్రి భార్య ప్రసంగిస్తున్న దృశ్యం వారికి కనిపించింది. ఆ సభలోకి దూరిన విద్యార్థులు.. ‘ఇక్కడ ఉద్యోగాల కోసం అడుగుతుంటే సమాధానం చెప్పేవాళ్లు లేరు. అడిగినవాళ్లనే చంపుతున్నారు. ఆపండి మీ ప్రసంగం’ అని నిలదీశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ సీఎం కారును గుర్తించి దానికి నిప్పంటించారు. ‘గూండా హుకూమత్ ఖతమ్ కరో’ అని నినాదాలు చేశారు.
ఇక్కడి ఉద్యోగాలు ఈ ప్రాంతం వారికే దక్కేలా 1919లో నిజాం ఇచ్చిన ముల్కీ రూల్స్‌ను, పెద్ద మనుషుల ఒప్పందాన్ని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను సమైక్య పాలనలో కాలరాశారు. ఇప్పుడు తెలంగాణకు న్యాయం జరగాలంటే ముల్కీ రూల్స్‌కు మించిన స్పిరిట్ అమలు కావాలనే కోణంతో పని చేశాం. ఉద్యోగాల్లో తెలంగాణ ప్రజల హక్కులను శాశ్వతంగా కాపాడేలా 95 శాతం లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చాం.
– కేసీఆర్