ఎల్కతుర్తి, జూన్ 8 : ప్రధాని మోదీ ఎనిమిదేండ్లలో 120 శాతం మేర అప్పులు చేసి ఏం అభివృద్ధి చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులపాలైందని ప్రతిపక్షాలు దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నాయని అవి ఎంత మాత్రం నిజం కావన్నారు. వచ్చే 30 ఏండ్లలో ఆ అప్పులు తీర్చుకొనే వెసులుబాటు ఉన్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయంతో ఉద్యోగుల జీతాలు, రోడ్లు, తదితర సంక్షేమ పథకాలన్నింటినీ అమలుచేస్తున్నదని చెప్పారు.
కేవలం ప్రాజెక్టు నిర్మాణాలకు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే అప్పులు చేస్తున్నదని స్పష్టం చేశారు. పల్లెప్రగతిలో భాగంగా బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. పట్టణాల్లో ఉండే వసతులు గ్రామాల్లో ఉండాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఆకాంక్షించేవారని, ఆయన మాటలను సీఎం కేసీఆర్ పల్లెప్రగతి రూపంలో నిజం చేశారని కొనియాడారు. తడి, పొడి చెత్త బుట్టలు, గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేవన్నారు. గోదావరి, కృష్ణా జలాలను తరలించి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. మినరల్ వాటర్ బాటిల్ కంటే భగీరథ నీళ్లే మంచివని చెప్పారు. కేంద్రం ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో 9 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపికకావడం గర్వకారణమన్నారు.