హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో జ్యుడిషియల్ సభ్యుల నియామకానికి సంబంధించిన నిబంధనలను తెలియజేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ నియామక అర్హతలను సవాల్ చేస్తూ హైదరాబాద్ ‘క్యాట్’ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీ గురుదాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇతర ట్రిబ్యునళ్లలో జ్యుడిషియల్ సభ్యుల నియామకానికి, క్యాట్‌లో జ్యుడిషియల్ సభ్యుల నియామకానికి నిబంధనలు వేర్వేరుగా ఉండటం అన్యాయమని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. న్యాయవాదిగా పదేండ్లు ప్రాక్టీస్ చేసినవారు ఉంటే ఇతర ట్రిబ్యునళ్లలో జ్యుడిషియల్ సభ్యులుగా నియమితులయ్యేందుకు అర్హులని తెలిపారు. దీని ప్రకారం క్యాట్‌లో జ్యుడిషియల్ మెంబర్‌గా రంజన్ మిశ్రాను నియమించడం చెల్లదంటూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. దీంతో కేంద్రానికి నోటీసులు జారీచేసిన హైకోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.