హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా గుడిమలాపూర్, నానల్‌నగర్‌లోని ఒక స్థలానికి ముగ్గురు వ్యక్తులు సృష్టించిన తప్పుడు పత్రాలకు ఎన్వోసీ ఇచ్చిన అప్పటి కలెక్టర్ నవీన్ మిట్టల్‌పై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారని, ఆ వివరాలు అందజేసేందుకు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు.
శాంతి అగర్వాల్ అనే మహిళ 2011లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఎన్వోసీని రద్దు చేయడంతోపాటు నాటి హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్, జాయింట్ కలెక్టర్ వీవీ దుర్గాదాస్, మరో ఇద్దరు తహసీల్దార్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మిట్టల్, ఇతరులు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.