నల్లబెల్లి/గూడూరు/మహబూబాబాద్ రూరల్/నాగర్కర్నూల్ రూరల్, మే 10 : అకాల వర్షానికి ధాన్యం, మక్కలు తడిసి ముద్దవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రానికి 20 రోజుల క్రితం రైతులు మక్కలను తీసుకొచ్చారు.
కాంటా పెట్టకపోవడంతోపాటు వాహనాలను సమకూర్చక పోవడంతో రైతులు మండుటెండలో పడరాని పాట్లు పడ్డారు. శనివారం రాత్రి గాలి దుమారంతో వర్షం కురువడంతో ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని మకలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయకపోవడంతో అకాల వర్షానికి తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఈదురు గాలులకు మహబూబాబాద్ మండలం బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం, వేంనూరు గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం నెల్లికొండ గేట్ సమీపంలోని వ్యవసాయ మార్కెట్లో కురిసిన వర్షానికి రైతులు ఆరబోసుకున్న మక్కలు తడిసి ముద్దయ్యాయి. ఆరబోసిన మక్కలు వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో రైతులు నిల్వ చేసిన ధాన్యం రాశులు తడిసిపోయాయి.