లక్ష్మణచాంద, ఆగస్టు 19: సోదరుడికి రాఖీ కట్టడానికి వెళ్లి ఓ వృద్ధురాలు మృత్యువాత పడింది. ఈ ఘటన సోమవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్ గ్రామంలో చోటుచేసుకుంది. వడ్యాల్‌కు చెందిన రాల్లబండి చిన్నమ్మ(70) ఖానాపూర్ మండలం దిల్వార్పూర్లో ఉంటున్న సోదరుడు రసమల్ల బద్దయ్యకు రాఖీ కట్టడానికి ఆదివారం వెళ్లింది. సోమవారం ఉదయం గ్రామంలోని కాలువ సమీపంలో ప్రమాదవశత్తు కాలుజారి కాలువలో పడిపోయింది. బంధువులు వెతకగా కాలువలో ఆమె మృతదేహం లభించింది. ఆమె కుమారుడు ముత్తన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఖానాపూర్ ఎస్సై లింబాద్రి తెలిపారు.
నర్సాపూర్, ఆగస్ట్19: రాఖీ కడుదామని బయలుదేరిన అక్కాచెల్లెళ్లు సోదరుడి మరణవార్త విని గుండెలవిసేలా రోదించా రు. సోమవారం మెదక్ జిల్లా కాగజ్మద్దూర్లో రాఖీ పండుగ పూట విషాదం నిండింది. గ్రామానికి చెందిన బోగ దశరథ్ (50)కు ముగ్గురు అక్కలు, చెల్లెలు ఉన్నా రు. వారు దశరథ్కు రాఖీ కడుదామని ఉదయమే బయలుదేరా రు. ఇంతలోనే దశరథ్ గుండెపోటుతో మృతి చెందాడని తెలిసి ఆ అక్కాచెల్లెళ్లు గుండెలు పగిలేలా రోదించారు. బీఆర్ఎస్ నర్సాపూర్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌కు దశరథ్ సోదరుడు.