హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, అదే తరహాలో బీసీ కులగణనకు సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలివ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ నెల 7న నిర్వహించనున్న అఖిల భారత ఓబీసీ 9వ మహాసభల వాల్‌పోస్టర్‌ను శుక్రవారం సచివాలయ మీడియా పాయింట్లో జాజుల ఆవిష్కరించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘ కాలంగా ఒకే నినాదంతో పోరాడి విజయం సాధించిన మందకృష్ణ మాదిగకు బీసీ సమాజం నుంచి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సమ గ్ర కులగణన జరిపి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని బీసీలు చేస్తున్న పోరాటాన్ని గుర్తుచేశారు. బీసీల ఆకాంక్షలను గౌరవించి కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీల మహాధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజు తదితరులు పాల్గొన్నారు.