కల్యాణ వీణ మోగింది..పెండ్లి సందడి మొదలైంది..బంధు పరివారం తరలిరాగా,వధూవధుల వేడుకకు వేళైంది..సర్కారు పెట్టే కరోనా ఆంక్షలు లేవు..పెండ్లివారింట ఆర్భాటాలకు అవధుల్లేవు..ఈవెంట్స్ ఇండస్ట్రీకి ఆర్డర్ల కొదవ లేదు..లక్షలాది మంది ఉపాధికి ఢోకా లేదు..ఎక్కడికి వెళ్లినా పెండ్లిళ్ల కోసం ముచ్చట్లే..ఏ ఫంక్షన్ హాల్ తట్టినా పెండ్లి బాజాలే..
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): పెండ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. శనివారం నుంచి జూన్ 23 వరకు.. మధ్యలో 27 రోజులు వివాహాలకు దివ్యమైన ఘడియలు ఉన్నా యి. దీంతో వధూవరుల ఇండ్లల్లో సందడి షురూ అయ్యింది. పెండ్లికార్డులు, షాపింగ్, జ్యువెలరీ, ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్, ఈవెంట్ నిర్వహణ సంస్థల బిజినెస్ అంతా జోరందుకొన్నది. మొన్నటి దాకా కరోనాతో కళ తప్పిన పెండ్లి పందిళ్లు ఇక నిండుగా దర్శనమివ్వనున్నాయి.
పురోహితులు, వంటచేసేవాళ్లు, ఫొటోగ్రాఫర్లు, సైప్లె కంపెనీలు, క్యాటరింగ్, లైటింగ్, పూల అలంకరణ, మంగళవాయిద్యాలు, బ్యాండ్ మేళం, బ్యుటీషియన్లు, టైలర్లు, వస్త్ర వ్యాపారులు, ఫర్నిచర్, కంసాలీలు.. ఇలా ఒక వివాహానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మంది పనిచేస్తారు. వారందరికీ ఈ సీజన్లో కావాల్సినంత ఉపాధి దొరకనున్నది.
ఈవెంట్స్పై ఆధారపడి ఇతర రంగాల వారు కూడా వ్యాపారం చేస్తుంటారు. డెకోరేషన్, లైటింగ్, పూలు, ఫుడ్, గిఫ్ట్స్ తదితర ఇండస్ట్రీలు ప్రత్యక్షంగా బిజినెస్ చేస్తుంటాయి. ైక్లెంట్ బడ్జెట్ ఆధారంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం పెండ్లిళ్ల సీజన్ కావడంతో ఈవెంట్ కంపెనీలన్నీ కళకళలాడుతున్నాయి. తెలంగాణలో 1,100 ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఉన్నాయి. 5,500 అసోసియేషన్లు ఉన్నాయి. లక్షల మంది ఈవెంట్ ఇండస్ట్రీలపై ఆధారపడి ఉన్నారు. ఈవెంట్ ఇండస్ట్రీలో 30 శాతం మహిళలే ఉన్నారు. సుమారు రూ.1,300 కోట్ల టర్నోవర్ ఉన్నది.
ముహుర్తాలు వరుసగా ఉండటంతో అదే స్థాయిలో ఈవెంట్స్ వస్తున్నాయి. కరోనా పరిస్థితుల్లో ఆంక్షల మధ్య పెండ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడా పరిస్థితి లేకపోవటంతో చాలామంది తమ పిల్లల వివాహాన్ని ఘనంగా చేయటానికే ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటిదాకా మాకు 20 ఈవెంట్స్ వచ్చాయి. ఇతర రాష్ర్టాల నుంచీ వస్తున్నాయి. ఒక ఈవెంట్కు 70 మంది 3 రోజుల ముందు నుంచే పనులు చేయాల్సి ఉంటుంది.
– ప్రభా చౌదరి, మేనేజింగ్ డైరెక్టర్,పెరల్ మార్వెల్ ఈవెంట్స్
హైదరాబాద్లో వివాహం చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ఉన్న వసతులు, కన్వెన్షన్లు వారిని ఆకట్టుకొంటున్నాయి. పెండ్లిళ్ల సీజన్ కావటంతో మాకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. కస్టమర్ అడిగే తేదీల్లో మాకు సమయం లేకపోతే వాటిని మరో ఈవెంట్ కంపెనీలకు అందిస్తున్నాం. పెండ్లి విషయంలో ఎవ్వరూ డబ్బు గురించి ఆలోచించరు. వారి ఆలోచనంతా ఎంత ఘనంగా జరుపుకొన్నామనే ఉంటుంది. వారు కోరుకున్న విధంగా వివాహాలు నిర్వహిస్తాం.
– లౌలీన శాంతి కుమార్, ఈవెంట్ చార్మర్స్
ఏప్రిల్లో..: 16, 17, 21, 22, 24
మేలో.. : 3, 4, 13, 14, 15, 18, 20, 21, 22, 25
జూన్లో..: 1, 3, 5, 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23