Congress Govt | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ఉచితంగా పంపిణీ చేసే బతుకమ్మ చీరల పంపిణీని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. బతుకమ్మ ప్రారంభం కావడానికి 40 రోజుల సమయం మాత్రమే ఉన్నా చీరల పంపిణీ గురించి ఎలాంటి హడావుడిలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతన్నలకు బతుకమ్మ చీరల తయారీపై ఆర్డర్లేవీ రాలేదు. పనులు లేక ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న నేతన్నల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. 2017 – 2023 వరకు ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలు అందుకున్న మహిళలు ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా లేదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరల తయారీ బాధ్యతలను నేతన్నలకు ఇచ్చి, వారికి చేతి నిండా పని కల్పించి ఆదుకున్న ఘనత మాజీ సీఎం కేసీఆర్కు దక్కింది. 2017 నుంచి ప్రతి ఏడాది కోటి మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. 2017 నుంచి 2023 వరకు బతుకమ్మ చీరల తయారీ కోసం రూ. 2,157 కోట్లు కేటాయించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.