రాజన్న సిరిసిల్ల, మార్చి 25 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. తాజాగా ఓ నేత కార్మికుడు ఉసురు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెందిన నేత కార్మికుడు పరికిపండ్ల రాజు (55) కుటుంబం ఉపాధి నిమిత్తం 30 ఏండ్ల కింద మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి సిరిసిల్లకు వలస వచ్చింది. రాజుకు భార్య పద్మ, కొడుకు రాకేశ్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఏడాదిన్నర కిందట ప్రభుత్వం మారడం, బతుకమ్మ చీరలు బంద్ కావడంతో సాంచాల పని లేకుండాపోయింది. పిల్లల పెళ్లిళ్లకు చేసిన రూ.5 లక్షల అప్పు మీద పడింది. కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. తీవ్ర మనస్తాపం చెందిన రాజు.. సోమవారం యాసిడ్ తాగాడు. కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సర్కారు వల్లే నేతన్నల ఆత్మహత్యలు
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రంలో నేత కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమపై సరైన అవగాహన లేని, కార్మికులకు ఉపాధి కల్పించలేని ప్రభుత్వ తీరుతో ఇప్పటికే అనేక మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజు కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన పరామర్శించారు.
బెట్టింగ్‌కు యువకుడి బలి ; మేడ్చల్ జిల్లాలో విషాదం
మేడ్చల్, మార్చి 25: క్రికెట్ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. రూ.లక్ష నష్టపోయి, మనస్తాపానికి గురైన గుండ్లపోచంల్లికి చెందిన సోమేశ్ (29) రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గౌడవెల్లి పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భోగాపురానికి చెందిన రమణ 25 ఏండ్ల కిందట గుండ్లపోచంల్లికి వలస వచ్చారు. ఆయన కుమారుడు సోమేశ్ (29) దేవరయాంజాల్‌లోని ఓ సంస్థలో పని చేస్తున్నాడు. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెట్టింగ్ పెట్టిన సోమేశ్ రూ.లక్ష పోగొట్టుకున్నాడు. అందులో కొంత సంస్థకు చెందిన సొమ్ము కూడా ఉంది. దీంతో మనస్తాపానికి గురై గౌడవెల్లి పరిధిలోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, నాలుగేండ్ల కిందట తన అక్క పెండ్లి కోసం తీసుకొచ్చిన రూ.3 లక్షలను సోమేశ్ బెట్టింగ్‌లో పోగొట్టాడు. కుమారుడు ఏమైనా అఘాయిత్యానికి పాల్పడకూడదని తల్లిదండ్రులే అప్పులు తీర్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.