తల్లాడ, అక్టోబర్ 5: తమ ఊరి సమస్యలను పరిష్కరించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామస్థులు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం వారు ఫ్లెక్సీ, ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. తమ గ్రామ సమస్యలపై ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నాయకులు, ప్రజాప్రతినిధులు ఓట్లు అడిగేందుకు గ్రామానికి రావద్దని స్పష్టంచేశారు. గ్రామానికి ప్రభుత్వం సరైన రహదారిని, వాగు వద్ద కల్వర్టును నిర్మించలేదని ఆరోపించారు. దీంతో వర్షకాలంలో బురదలోనే రాకపోకలు సాగించాల్సి వస్తున్నదని చెప్పారు. కల్వర్టు లేక వాగులో మెడ లోతు నీటిలో వెళ్లాల్సి వస్తున్నదని, లేదంటే ట్రాక్టర్లపై కూర్చోని వాగు దాటాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రహదారి, కల్వర్టు సమస్యలను పరిష్కరించే వరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు.