సంగారెడ్డి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): టెస్లాకు దీటుగా అటానమస్ వాహనాల తయారీలో ఐఐటీ హైదరాబాద్ ముందంజలో ఉండటం దేశానికే గర్వకారణమని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు కొనియాడారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను సందర్శించారు. ఐఐటీలో టీహాన్, సుజుకి సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన అటానమస్ వెహికిల్‌ను పరిశీలించారు. ఐఐటీహెచ్ అభివృద్ధి చేసిన అటానమస్ వెహికిల్‌లో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ప్రొఫెసర్ రాజ్యలక్ష్మితో కలిసి ప్రయాణించారు. ఈ వాహనం ఎంతో అద్భుతంగా ఉన్నదని ప్రశంసించారు. దేశీయ టెక్నాలజీతో దేశంలోని ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణించే అటానమస్వెహికిల్ను ఐఐటీహెచ్ తయారు చేయ టం దేశానికే గర్వకారణమని అన్నారు. అటానమస్ వాహనాల తయారీలో ఐఐటీహెచ్ తమ పరిశోధనల్లో విప్లవం తీసుకురానున్నట్టు తెలిపారు. ఈ వాహనం త్వరలోనే రోడ్డుపైకి రావాలని, ఇందుకు ప్రభుత్వంతరఫున సహా యం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ శాఖల్లో కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను వినియోగిస్తామని ఇందుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రభుత్వంలోని వ్యవసాయశాఖతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి ప్రజలకు మేలు జరిగేలా చూస్తామని అన్నారు. ఐఐటీహెచ్ సేవల వినియోగం కోసం ఈ సంస్థ డైరెక్టర్ బీఎస్ మూర్తిని స్కిల్ యూనివర్సిటీ బోర్డు మెంబర్‌గా నియమించనున్నట్టు పేర్కొన్నారు.